తల్లి ఆరోగ్యం కోసం తనయుని ఆరాటం- కలియుగ శ్రవణుడు మల్లయ్య

తల్లి ఆరోగ్యం కోసం తనయుని ఆరాటం- కలియుగ శ్రవణుడు మల్లయ్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కన్నవాళ్లను కనీసం తిండి పెట్టకుండా, పట్టించుకోకుండా కొడుకులు వ్యవహరిస్తున్న తీరు మనకు తెలిసిందే. బరువుగా భావించి వృద్ధాశ్రమానికి తరలిస్తున్న ఘటనలు కూడా వింటున్నాం. అయితే ఖానాపూర్ కు చెందిన మల్లయ్య తల్లి కోసం, ఆమె ఆరోగ్యం కోసం తపిస్తున్న తీరు చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్ళు చెమర్చక మానవు. ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య తల్లి 70 ఏళ్లు దాటిన వృద్ధురాలు. గత కొన్ని మాసాలుగా ఆ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది.

అయితే ఫలితం అంతంత మాత్రంగానే ఉండడంతో చివరి ప్రయత్నంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం తో పరిస్థితి మారుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా చెక్కబండి తయారు చేసుకుని అందులో తన తల్లిని కూర్చోబెట్టుకుని పాదయాత్ర చేపట్టాడు. ఎండ వేళల్లో సేద తీరుతూ చెక్కబండిని తోసుకుంటూ వెళుతున్న మల్లయ్య ను చూసిన వారంతా ఆయన మాతృ భక్తికి మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఖానాపూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరానికి వెళ్ళాడు. ఆయన కృషి ఫలించి ఆ తల్లి ఆరోగ్యం కుదుట పడాలని చూసిన ప్రజానీకం కోరుకుంటున్నారు.