కిటకిటలాడిన రంగగిరి

కిటకిటలాడిన రంగగిరి

రంగనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: మౌలాలో వెలసిన శ్రీరంగనాథుని దివ్య ధామం రంగగిరి క్షేత్రం నూతన సంవత్సరం తొలి రోజు సోమవారంనాడు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో  నూతన శోభను సంతరించుకుంది. 
శ్రీవైష్ణవశ్రీ గోష్ఠి కి చెందిన భాగవతోత్తములు అశేష సంఖ్యలో విచ్చేశారని రామానుజ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ ఒక ప్రకటనలో తెలియజేశారు.

వైష్ణవ శ్రీభాగవతోత్తములు శ్రీరంగగిరికి పెద్ద సంఖ్యలో విచ్చేసి, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణంతో  మంగళప్రదమైన స్వాగతం పలకడం ఆనవాయితీగా మారిందని, కొత్త ఆంగ్ల ఏడాది ప్రారంభమవుతున్న శుభసందర్భంలో వైష్ణవశ్రీ తరపున మహిళలతో పాటు భాగవతోత్తములు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. తిరుప్పావై సేవాకాలం తర్వాత సామూహికంగా విష్ణు సహస్ర నామ పారాయణం అద్భుతంగా జరిగిందని వివరించారు. నిత్య కైంకర్యంలో భాగంగా వివిధ స్తోత్రాల అనుసంధానం,పల్లకీ సేవ, మాలా సమర్పణం తదితర కార్యక్రమాలు యధారీతిలో జరిగాయని తెలిపారు. శ్రీరంగనాథుని భక్తులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.