ప్రభుత్వం ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తాం...

ప్రభుత్వం ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తాం...
  • నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరణ చర్యలు
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు
  • గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు జీరో బిల్ అందించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం, గ్యారెంటీ  పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంత్రి  శ్రీధర్ బాబు మంథని పట్టణంలో తన క్యాంపు కార్యాలయం సమీపంలోని సత్యసాయి నగర్ లో గృహ జ్యోతి కార్యక్రమం క్రింద జీరో బిల్లులు లబ్ధిదారులకు అందజేశారు. 

సత్య సాయి నగర్ లో నివాసం ఉంటున్న డి.వేణుకు  481 రూపాయలు, మంథని లక్ష్మికి 179 రూపాయలు గృహ జ్యోతి సబ్సిడీ క్రింద కరెంట్ బిల్ ప్రభుత్వం చెల్లించి జీరో బిల్లులను వారికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి  శ్రీధర్ బాబు  మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామన్నారు. 

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం క్రింద ఇప్పటి వరకు 20 కోట్ల జీరో బస్ టికెట్స్ అందించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం ద్వారా వేల మందికి లబ్ధి చేకూరిందన్నారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులలో నాణ్యత, డిజైన్ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలియజేసిందని, ముందు వారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 

మంథని ప్రాంతంలో ఉన్న వనరులు ఇక్కడి ప్రజల భూములు వినియోగించుకొని పెద్దపల్లి, భూపాల్ పల్లి జిల్లాకు ఒక్క ఎకరానికి సైతం సాగునీరు అందించకుండా ప్రాజెక్టు రూపకల్పన గత ప్రభుత్వం చేసిందని మంత్రి గుర్తు చేశారు. నిపుణులు, ఎన్.డి.ఎస్.ఏ అందించిన నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మత్తులు చేసి పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు. 

అనంతరం మంథని లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని భావించిన స్వర్గీయ నాయకులు శ్రీపాద రావు ఇక్కడి గ్రామాలలో పాఠశాలలను ఏర్పాటు చేశారని, స్పీకర్ గా మంచి విలువలు నెలకొల్పారని, జవాబుదారీ తనతో పని చేశారని తెలిపారు.స్వర్గీయ శ్రీపాద రావు ఆశయాల సాధన మేరకు గతంలో మన ప్రభుత్వం హయాంలో జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంథనిలో సంగీత కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని,మంథని మారుమూల ప్రాంతంలో సైతం బస్ డిపో ఏర్పాటు చేయడంలో, రోడ్లు లేని గ్రామాలకు కాలినడకన వెళ్లి అందుబాటులో ఉన్న వనరులతో అభివృద్ధి చేయడంలో శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలను సంపూర్ణంగా పూర్తి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద లబ్దికి త్వరలో నాంది పలుకుతామని, పైరవీలకు తావులేకుండా అర్హులకు మాత్రమే లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని, మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయని ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు.  

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బాబా సాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్,  మంథని ఏడిఓ తూము రవీందర్ పటేల్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల  తిరుపతి యాదవ్,  ఎంపీపీ కొండ శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, నాయకులు ఇనుముల సతీష్, ముసుకుల సురేందర్ రెడ్డి, అజీమ్ ఖాన్, బొబ్బిలి శ్రీధర్, జనగామ నరసింరావు,  శశిభూషణ్ కాచే ఓడ్నాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టి.ఎస్. ఎన్.పి.డి.సి.ఎల్. - ఎస్. ఈ. బి.సుదర్శన్, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు,, సంబంధిత అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.