మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు...

మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు...
  • మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని   జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు( 87)జయంతి వేడుకలలో పాల్గొన్నారు. 

దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి  శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు జీవిత ప్రస్థానాన్ని కలెక్టరేట్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్ చదివి వినిపించారు.అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్  మాట్లాడుతూ  మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన మహనీయులు శ్రీపాదరావు అని, ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహరిస్తూ తన జీవితం కొనసాగించారన్నారు. 

న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ప్రజల ఆశీర్వాదంతో ఎదిగారని, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి శ్రీపాద రావు అని అన్నారు. మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి జీవితంలోని ముఖ్యంశాల నుంచి మనం వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం నేర్చుకోవచ్చని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక మంది స్థానిక నాయకుల  జయంతి వేడుకలను అధికారికంగా  నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీపాద రావు గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.