స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించడం సంతోషకరం...

స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించడం సంతోషకరం...
  • అధికారికంగా శ్రీపాదరావు జయంతి నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
  • మంథని ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే దిశగా చర్యలు
  • మంథని అభివృద్ధి కోసం 125 కోట్లతో మంథని శివారం బ్రిడ్జి నిర్మాణం
  • మంథని పట్టణంలో శ్రీపాద చౌరస్తా వద్ద నిర్వహించిన శ్రీపాద రావు జయంతి వేడుకలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకర మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా మంత్రి  శ్రీధర్ బాబు మంథని పట్టణంలో శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా  శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాద రావు ఒకరని, వారి సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే లు విజయ రమణా రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ల దృష్టికి తీసుకు వెళ్ళారని, వారి కోరికను అంగీకరించిన ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. 

నిరంతరం పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాద రావు అని, ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా విధులు నిర్వహించారని, ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు, సహచర మంత్రి వర్యులకు, ప్రభుత్వం తరఫున అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 

మంథని ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు తనకు శాసనసభ్యుడిగా అవకాశం కలిగిందని, తమ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించి ఈ ప్రాంతానికి మరింత సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. విద్య, వైద్యం, ఉపాధి పరంగా ఈ ప్రాంతంలో నివసించే అనేక మందికి మేలు చేయాలని ఉద్దేశంతో తనకు అందించిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించు కుంటానని తెలిపారు. తనకు ఉన్న శక్తి మేరకు కృషి చేసి మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

మంథని రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది  మానాన్న గారి లక్ష్యమని, దానిని నెరవేర్చే దిశగా ఇక్కడ చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. మంథని ప్రాంత రైతుల ప్రయోజనార్థం వేగవంతంగా అవసరమైన లిప్ట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టు వరకు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని, పైన ఉన్న రైతులు నీరు వాడుతున్నారని, దీనివల్ల చివరి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిని నివారించే దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి రైతుకు అవసరమైన మేర సాగునీరు అందించాలని, నీటి దుర్వినియోగం జరగకుండా చూడాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 

శ్రీపాదరావు ఆలోచన మేరకే మంథని గోదావరి పై బ్రిడ్జి నిర్మాణం

ఈ బ్రిడ్జి నిర్మాణంతో మంథని వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుంది

స్వర్గీయ శ్రీపాద రావు ఆలోచనల  మేరకు మంథని గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని మంత్రి అన్నారు. మంథని గోదావరి పై శివారం వరకు రూ. 125 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకున్న తరువాత  మంథని పట్టణం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా పాలన సాగిస్తున్న ప్రభుత్వం పట్ల సంఘవిద్రోహులు చేసే అసత్య ప్రచారాలకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని. చట్టాన్ని మీరే ప్రతి ఒక్కరిపై పార్టీలకతీతంగా చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఊపేక్షించమని అన్నారు. అనంతరం రావుల చెరువు వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించి, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు  దుప్పట్లు పంపిణీ చేశారు. మంథనిలోని సామాజిక ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, ఎంపీపీ కొండా శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, నాయకులు శశిభూషణ్ కాచే, ముసుకుల సురేందర్ రెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్, అజీంఖాన్, జనగామ నరసింహారావు,  పెరవేణి లింగయ్య, జాగరి సదానందం, పేరవేన రాజేష్,  ప్రజాప్రతినిధులు, సంభందిత అధికారులు, పార్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.