కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన స్వప్నలోక్ ఫైర్ ఆక్సిడెంట్

కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన స్వప్నలోక్ ఫైర్ ఆక్సిడెంట్

కలల సౌధాలు ప్రాణాలు కోల్పోయారన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆశల సౌధాలను అక్కున్న చేర్చుకున్న స్వప్న లోక్ కాంప్లెక్స్ తమ వారసులను శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లిందన్న సమాచారం అందుకున్న ఆ పేరెంట్స్ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ లో ఉమ్మడి జిల్లా బిడ్డలు చనిపోయారని తెలిసి ఓరగల్లు వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా వారే మృత్యువాత పడడం స్థానికులను కలిచి వేస్తోంది.

ఉపాధి కోసం…

వీరంతా కూడా స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని బీఎం 5 కాల్ సెంటర్ లో పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాల్ సెంటర్లో ఉపాధి పొందుతున్న వీరు అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఊపిరాడక మృత్యువు చేతిలో ఓడిపోయారని వివరించారు. తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుపై కలలు కంటున్న ఆ తల్లిదండ్రులు పిడుగు లాంటి కబురందుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విగత జీవులైన తమ బిడ్డలను అగ్ని ప్రమాదం బలి తీసుకుందంటూ రోధిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తోంది. చెట్టంత ఎత్తుకు ఎదిగిన తమ బిడ్డలున్నారని గుండె ధిటువు చేసుకుని బ్రతుకున్న తాము ఇప్పుడు గుండె నిబ్బరం చేసుకోలేక పోతున్నామంటూ ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది.

మృతుల వివరాలివే…

ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా ఐదుగురు కూడా ఉమ్మడి వరంగల్లు బిడ్డలే కావడం బాధాకరం. మహబూబాబాద్ జిల్లా సురేష్ నగర్ కు చెందిన ప్రమీల (22), కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ప్రశాంత్ (23), వరంగల్ జిల్లా నర్సంపేటకు మండలం ఖానాపూర్ తండాకు చెందిన బి శ్రావణి(22), మర్రిపల్లికి చెందిన వెన్నెల (22), నర్సంపేటకు చెందిన శివ (22)లు స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు.