రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలి
  • రాష్ట్రవ్యాప్తంగా పాల్గొననున్న 40 జట్లు
  • వసతి, భోజనాది సౌకర్యాలకు మంత్రి జగదీష్ రెడ్డి సహకారం
  • బాస్కెట్బాల్ కోర్టును పరిశీలించిన బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,  తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

ముద్ర ప్రతినిధి: సూర్యాపేట వేదికగా ఈ నెల 25 నుంచి 27 వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాస్కెట్బాల్ కోర్టులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యూత్ ఛాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,  తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని బాస్కెట్బాల్ కోర్టులో జరుగుతున్న రాష్ట్రస్థాయి యూత్ ఛాంపియన్ షిప్ పోటీల ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి యూత్ ఛాంపియన్ షిప్ బాస్కెట్బాల్ పోటీలకు వసతి భోజనాది సౌకర్యాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 40 బాస్కెట్బాల్ జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు. అండర్ 16 విభాగంలో జరిగే ఈ పోటీలకు బాల బాలికలతో సహా మొత్తం 600 మంది వరకు ప్రతినిధులు హాజరుకానున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. రాష్ట్రస్థాయి యూత్ ఛాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీల్లో తలపడేందుకు సూర్యాపేట జిల్లా జట్టును ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం బాస్కెట్బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన వెంట బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు,  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,  జిల్లా కార్యదర్శి ఫారుక్, బి ఎస్ పి నాగభూషణం, జిల్లా టిఆర్ఎస్ నాయకులు వుప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్, కల్లెట్లపల్లి శోభన్ బాబు, బాస్కెట్ బాల్ అసోసియేషన్ నాయకులు,  క్రీడాకారులు పాల్గొన్నారు.