అమెరికాలో అదృశ్యమైన హైదరాబాదీ యువతి సేఫ్‌..

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాదీ యువతి సేఫ్‌..

ముద్ర,తెలంగాణ:-అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థిని నితీశా కందుల (23) క్షేమంగానే ఉంది. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్‌బెర్నార్డినో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.శాన్‌బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్న నితీశా కందుల గత నెల 28 నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సాయం కోసం ఆమె కుటుంబసభ్యులు సోషల్‌మీడియా వేదిక ద్వారా అభ్యర్థించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన శాన్‌ బెర్నార్డినో పోలీసులు ఆమె చివరిగా లాస్‌ ఏంజెల్స్‌లో కాలిపోర్నియా నంబర్‌ ప్లేట్‌తో ఉన్న టయోటా కారును గత నెల 30న నడుపుతూ కనిపించిందని కొంత మంది చెప్పినట్టు వెల్లడించారు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టి.. చివరకు క్షేమంగా గుర్తించినట్లుగా వెల్లడించారు.