కాంగ్రెస్ పూటకో దొంగ డిక్లరేషన్

కాంగ్రెస్ పూటకో దొంగ డిక్లరేషన్
  • మాకు ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారు
  • రాబోయే ఎన్నికల్లో విజయాలకు - అబద్ధాలకు మధ్యే పోటీ
  • మత్స్యకారుల గుర్తింపు కార్డుల పంపిణీలో మంత్రి హరీశ్​రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : పూటకో దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు.  త్వరలో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ఏఐసీసీ మీటింగ్ లో అబద్దాలను చెప్పబోతోందని ఆయన విమర్శించారు. అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏమి చేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు విజయాలకు,  అబద్దాలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కౌరవ కాంగ్రెస్ వాళ్ళు గెలవరని,  ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారని చెప్పారు. ఎన్నో విజయాలను సాధించి దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మూడోసారి కేసీఆర్  సీఎం అవడం ఖాయమని,  తెలంగాణ ప్రజలే తమకు సెల్ఫ్ డిక్లరేషన్ అని ఆయన అన్నారు.

ఆదివారం సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ లో  సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గంలోని 7,200 మంది గంగపుత్రులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్ రావు, పశుసంవర్థక శాఖ మంత్రి  శ్రీనివాస్ యాదవ్​పాల్గొని లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు వేల కోట్ల రూపాయలను మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హాయంలో సబ్సీడీపై చేప పిల్లలు వేసేవారని,  కానీ నేడు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో ఉచితంగా వందశాతం సబ్సీడీతో చేప పిల్లలను పెంచుతున్నామని ఆయన చెప్పారు. సిద్ధిపేట నుంచి మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కు చేపలు ఎగుమతి అవ్వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా చేపలు, రొయ్యలు, గొర్రెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఎంపీ కొత్త  ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ వైస్ చైర్మన్ డీటీ.మల్లయ్య,  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,  జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ పాల్గొన్నారు.