రేసు గుర్రాలపై  కేసీఆర్ ఫోకస్

రేసు గుర్రాలపై  కేసీఆర్ ఫోకస్
  • వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి!
  • అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు పూర్తి
  • సెప్టెంబర్​6న అధికారిక ప్రకటన?
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులు

 ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారీ స్కెచ్ వేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా పూర్తయ్యింది. ఇక ఏ క్షణంలోనైనా జాబితాను అధికారికంగా వెల్లడించే అవకాశముందని గులాబీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో మంచి ముహూర్తం చూసుకొని ఏ క్షణమైనా జాబితాను రిలీజ్ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. అన్నీఅనుకూలిస్తే  సెప్టెంబర్​మొదటి వారంలో జాబితా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉంటారా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. 

  • 30 నుంచి 40 మందితో జాబితా..

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ గతంలో పలుమార్లు చెప్పినా.. పలువురిని మార్చే ఆలోచనలో సీఎం ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో ఉండే ఆ సిట్టింగ్‌లు ఎవరు..? ఆశావహుల్లో ఎవరెవరికి టికెట్ దక్కుతుంది..? అనే చర్చ గులాబీ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే జిల్లాలవారీగా రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టడమే కాదు... మార్చాల్సిన అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీతోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారం పది రోజులుగా తొలి జాబితా కూడా రెడీ అయిపోయిందన్న వార్తలు పార్టీలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి జాబితాలో సుమారు 30 నుంచి 40 మందికిపైగా అభ్యర్థులతో కూడిన జాబితాను  ప్రకటించనున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించటమే కాకుండా ఏకంగా 90 మందికిపైగా అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా ప్రకటించారు. ఈసారి కూడా అన్ని పార్టీల కంటే ముందుగానే గులాబీ పార్టీ తరపున బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా తొలి జాబితా కోసం కేసీఆర్ నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? అని సిట్టింగ్‌లు, ఆశావహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ నెలలోనే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారనే చర్చ జరిగింది. అయితే రెండు రోజుల క్రితం వరకు అధిక శ్రావణ మాసం నడుస్తుండటం.. ఇది శుభకార్యాలకు అనువైనది కాకపోవడంతోనే జాబితా ప్రకటనలో జాప్యం చేశారని తెలుస్తోంది. సెంటిమెంట్లను బలంగా విశ్వసించే కేసీఆర్ నిజశ్రావణ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన లక్కీ నంబర్ గా భావించే 6 వచ్చేలా ముహుర్తం ఖరారు చేస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే సెప్టెంబర్​6వ తేదీన తొలి జాబితా బయటికి రావొచ్చనే లీక్ లు బయటికి వస్తున్నాయి. 

  • పలువురు సిట్టింగ్ లపై అసంతృప్తి..

పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని సర్వేల్లో తేలింది. 40 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని,వారిలో అతి ఎక్కువ వ్యతిరేకత ఉన్న 20 మందిని మార్చి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు  చెబుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే వేర్వేరు వేదికలపై అక్కడి సిట్టింగ్​ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ సిట్టింగ్​ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారైనట్టు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్, వీరిలో కాంగ్రెస్, టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో జాయిన వారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో 20 నుంచి 25 మంది పేర్లను ఇది వరకే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. వారు కాకుండా మిగతా వారి పేర్లకు జోడించి జాబితా విడుదల చేస్తారా? లేక చివరి నిమిషంలో అందులో కూడా మార్పులు జరిగే అవకాశముందా? అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. 

  • టికెట్ల రచ్చ.. ముదురున్న విభేదాలు
     

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో టికెట్ల రచ్చ సాగుతోంది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పలువురు ఆశావహులు రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారు. పార్టీ అధిష్టానం తమమాట వినకుండా మరోసారి సదరు ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రత్యక్షంగానే హెచ్చరిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా క్యాంప్ సమావేశాలు ఇప్పటిదాకా జిల్లాలకే పరిమితం కాగా.. ఇపుడు హైదరాబాద్ కు కూడా పాకాయి.

  • ఎమ్మెల్యేలకు

తాజాగా జనగామ ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కోపంగా ఉన్న స్థానిక నేతలు బుధవారం ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సమావేశమయ్యారు. జనగామ ఇక్కటి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో  ముత్తిరెడ్డి వ్యతిరేకవర్గం నేతలు, నాయకులు పల్లాకే టికెట్​ఇవ్వాలని మీటింగ్ లో చర్చించినట్లు సమాచారం.  కాగామీటింగ్​ఈ విషయం తెలుసుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టూరిజం ప్లాజాకు రావడంతో  స్థానిక నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే  తాము నియోజకవర్గ సమస్యలు వివరించేందుకు మంత్రి హరీశ్ రావు వద్దకు వచ్చామని చెప్పుకొచ్చారు. కాగా ‘నాతో రండి.. మంత్రి హరీశ్​రావు దగ్గరికి తీసుకెళ్తా’ అని ముత్తిరెడ్డి చెప్పగా స్థానిక నేతలు తిరస్కరించారని సమాచారం. 

  • రామగుండం ఎమ్మెల్యే మీద కూడా..

కొద్ది రోజుల క్రితం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా ఇలాగే సమావేశాన్ని స్థానిక నేతలు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ వారిని హైదరాబాద్ కు పిలిచి క్లాస్ పీకారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని, లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ఈ సారి మార్చాల్సిందేనంటూ ఆ నియోజకవర్గం నేతలు బహిరంగంగానే పార్టీ అధిష్టాన వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యుడు బేతి సుభాష్ రెడ్డి, తాండురూలో పైలెట్ రోహిత్ రెడ్డి, మహేశ్వరంలో మంత్రి సబితా ఇందిరారెడ్డి, ముషీరాబాద్ లో ముఠాగోపాల్, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలకు కూడా స్థానిక పార్టీ నేతల నుంచి తీవ్ర  స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.