పథకాలకోసం ఎదురి చూసే రోజులకు నూకలు చెల్లాయి

పథకాలకోసం ఎదురి చూసే రోజులకు నూకలు చెల్లాయి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: ప్రభుత్వ పథకాల అమలు కోసం, వాటి నుంచి లబ్ధి పొందేందుకు ఎదురుచూసే రోజులకు నూకలు చెల్లాయని ఇకపై ప్రజల సమక్షంలోనే పథకాల అమలు కొనసాగుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అడ్డాకుల మండలం బలిద్పల్లి, కన్మనూర్, చిన్నమునుగల్చేడ్ గ్రామాలతో పాటు ఖిల్లా ఘనపురం మండల పరిధిలోని మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఆయన అడ్డాకుల మండలం తహసిల్దార్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.


గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ప్రజాప్రతినిధుల ఇల్ల చుట్టూ, అధికారుల చుట్టూ నిరంతరాయంగా తిరిగేవారని నేడు ఇందిరమ్మ రాజ్యంలో అలాంటి రోజులకు నూకలు చెల్లాయని ప్రజా సమక్షంలోనే ప్రభుత్వ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 28 నుంచి ప్రతి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని గ్రామాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా పాలన కార్యక్రమం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను. ఆదేశించారు. కార్యక్రమంలో అడ్డాకుల మండల తాసిల్దార్ ఘాన్సీరామ్, ముసపెట్ మండల తాసిల్దార్ తోపాటు కన్మనూర్, బలీద్ పల్లి, చిన్నమునల్ చెడ్, మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.