కొండగట్టు లో జరిగే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

కొండగట్టు లో జరిగే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
  • శాంతి భద్రతల మధ్య అంగరంగ వైభవంగా జరిగేట్లు ఏర్పాట్లు చేయాలి
  • జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, శాంతి భద్రతల మధ్య అంగరంగ వైభవంగా జరిగేట్లు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో చొప్పదండి ఎమ్మెల్యే  సుంకే రవి శంకర్, ఎస్పి భాస్కర్, అదనపు కలెక్టర్ మంద మకరందతో కలిసి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వ తేదీ వరకు జరుగు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల గురించి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు సూచించారు. వేసవి కాలం సెలవులు అయినందున ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్ననందున మహిళలకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. భక్తులను క్యూలైన్లో పంపుటకు ఎన్.సి.సి., స్కౌట్లను, రెడ్ క్రాస్ సొసైటి సభ్యులను, సత్యసాయి ట్రస్టు నుండి కూడా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా సేఫ్టీ ముఖ్యమని తెలిపారు. వేసవి కాలం అయినందున ప్రతీ అరకిలో మీటర్ల దూరంలో చలి వేంద్రాలను గ్రామ పంచాయతిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించాలని సూచించారు.

విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అందుకు సంబంధించిన అన్ని వసతులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తం ఏడు  పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. అవి జే.ఎన్.టి.యు రోడ్డు వద్ద, బొజ్జ పోతన్న వద్ద,అనంత రెడ్డి భూమి ప్రక్కన, గుట్టపైన వైజంక్షన్ వద్ద, ఐ.కే.పి. సెంటర్ వద్ద, బొజ్జ పోతన్న వద్ద ప్రైవేట్ స్థలం వద్ద, కొండల రావు ప్రైవేట్ స్థలం వద్ద  పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  స్వామీ వారి కోనేరు వద్ద ఎప్పటికప్పుడు నీటినీ పంపింగ్ చేసి శుభ్ర పరుడంతో పాటు 120 షవర్ బాత్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలకు, పురుషులకు వేరు వేరుగా డ్రెస్సింగ్ రూమ్ లు, 76 శాశ్వత మరుగుదొడ్లను, 58 తాత్కాలిక మరుగుదొడ్లను  నిర్మించినట్లు తెలిపారు. జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని, దేవాలయంలో 16 సి.సి. కెమెరాలు, బయట 64 సి.సి. కెమెరాలను,  వీటితో పాటు అదనంగా 35 నుండి 40 వరకు సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

మెడికల్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.  వివిధ కళాకారుల చేత కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతలు, కట్టు దిట్టమైన పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలిస్ అధికారులకు కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శానిటేషన్ చేపించాలని అన్నారు. అక్కడక్కడ చలువ పందిళ్ళు ఏర్పాటు చేయించాలని వేసవి కాలం అయినందున నడిచి వచ్చే భక్తులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని అనంతరం వారు ముందుకు సాగుతారని పేర్కొన్నారు. నడిచి వచ్చే భక్తులకు  రాత్రి సమయాలల్లో రేడియం స్టిప్స్ వేయించాలని, వేయడం వల్ల ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఆమె తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర పకడ్బందీగా నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దర్శనానికి వచ్చిన భక్తులు మంచి అనుభూతితో ప్రశాంతంగా తీపి అనుభవాలలో తిరిగి వెళ్లేలా చూడాలని తెలిపారు.

 చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మాట్లాడుతూ గతంలో కరోనా కారణంతో ఉత్సవాలు నిర్వహించలేక పోయామని కానీ ఈ సారి ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. సియం పర్యటన తర్వాత ఇంకా ఎక్కువగా మంది వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో పక్కా పద్దతి ప్రకారం యాక్షన్ ప్లాన్ వేసుకొని ఒక్కో రోజు అమలు చేసుకోవాలని సూచించారు. తిరునాళ్ళ లాగా ఘనంగా నిర్వహించు కుంటూ సాంస్కృతిక కళ ప్రదర్శనలతో గొప్పగా నిర్వహించాలని తెలిపారు. అఖండ హనుమాన్ చాలిసా పారాయణం జరుతున్నట్లు తెలిపారు. విద్యుత్, వైద్యం, పార్కింగ్ సౌకర్యంతో పాటు మంచి నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కమాన్ కు ఇరువైపులా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని, ముత్యంపేట దారికి ఇరువైపులా అలంకారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వాలంటీర్లను ఎక్కువగా మందిని కేటాయించాలని వారికీ వాకీ-టాకీలను ఏర్పాటు చేయాలని, ప్రశాంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.  జిల్లా ఎస్పి భాస్కర్ మాట్లాడుతూ ఉత్సవాలలో భారీగా పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎటువంటి అసాంఘిక ఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ  హనుమాన్ జయంతి ఉత్సవాలని ఘనంగాన్ అధికారులు సమన్వయంతో నిర్వహించుకోవాలని సూచించారు. రాత్రి వేళలో నడిచే భక్తులు ఎక్కువగా ఉన్నందున రేడియం స్టిక్కర్లను, చేతిలో టార్చిలైట్లను ఉపయోగించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,  సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.