జిల్లాలో నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగాలి...

జిల్లాలో నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగాలి...
  • ఇసుక రవాణా వాహనాల తనీఖీ విస్తృతం చేయాలి
  • ఇసుక రవాణాపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మాత్రమే ఇసుక రవాణా జరిగే విధంగా అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ ఉంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇసుక  రవాణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  పెద్దపెల్లి జిల్లాలో మొత్తం 26 సాండ్ రీచ్ లు ఉన్నాయని, వాటిలో ప్రస్తుతం 18 రీచ్ లు ఆక్టివ్ గా ఉన్నాయని, స్థానిక అవసరాలకు, ప్రభుత్వ పనులకు ఇసుక కేటాయింపు చేసిన తర్వాత మిగిలిన ఇసుక రీచ్ లను టిఎస్ఎండిసి కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణ నియంత్రణ కోసం త్వరలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్రమ ఇసుక రవాణాపై ఎవరు ఫిర్యాదు అందించిన వెంటనే క్షేత్రస్థాయిలో సదరు సమస్య పరిష్కరించే విధంగా వ్యవస్థ రూపొందిస్తామని, దీనికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని పేర్కొన్నారు.

జిల్లాలో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎటువంటి ఇసుక రవాణాకు అనుమతి లేదని, 6 గంటల తరువాత అక్రమ ఇసుక రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. స్థానిక అవసరాలకు అవసరమైన మేర ఇసుకను గ్రామస్తులు తీసుకొనేందుకు పంచాయతీ కార్యదర్శి అనుమతిస్తారని, 3 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పట్టే వాహనంలో మాత్రమే స్థానిక అవసరాలకు ఇసుక తరలింపు వినియోగించాలన్నారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను రెవెన్యూ డివిజన్ అధికారి, తహసిల్దారులు పర్యవేక్షణలో తరలించాలన్నారు.  టీఎస్ ఎండిసి కేటాయించిన ఇసుక రీచ్ ల నుంచి నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక తరలింపు జరిగే విధంగా పక్కా పర్యవేక్షణ ఉండాలన్నారు. 

ఇసుక రీచ్ ల వద్ద ఎన్ని మీటర్ల మీద ఇసుక తవ్వుతున్నారు పరిశీలించాలని, అనుమతించిన దానికంటే అధికంగా తవ్వడం వల్ల బోరు బావులు ఎండిపోయే ప్రమాదం ఉందని, చెక్ డ్యామ్ లకు రూ. 500 మీటర్ల సమీపంలో ఇసుక తరలింపు లేకుండా చూడాలన్నారు. ఇసుక వాహనాలు నిబంధన మేరకు మాత్రమే లోడ్ తరలించాలని, నిబంధనలు పాటించని వాహనాలను వెంటనే సీజ్ చేసి, సంబంధిత డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.పెద్దపల్లి జిల్లాలో ఇసుక వాహనాలు రవాణా జరిగే ఐదు, ఆరు ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పకడ్బందీగా మరింత ఎక్కువగా పర్యవేక్షణ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వివిధ సమయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వాహనాలు, బ్లాక్ లిస్ట్ చేసిన వాహనాలలో ఇసుక తరలింపు వంటి వాటిని పరిశీలించి కట్టడి చేయాలనీ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ బి.గంగయ్య,డిపిఓ. ఆశాలత, మైనింగ్ కార్యాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.