పెద్దపల్లి జిల్లాలో విషాదం..పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అస్తమయం..

పెద్దపల్లి జిల్లాలో విషాదం..పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అస్తమయం..
  • అనారోగ్య సమస్యతో హైదరాబాద్ ఆస్పత్రిలో తుది శ్వాస..
  • నివాళులర్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావు,
  • నేడు అంత్యక్రియలు

ముద్ర పెద్దపల్లి ప్రతినిధి:- పెద్దపల్లి రాజకీయాలకు సుపరిచితుడు... మాజీ శాసనసభ్యుడు బిరుదు రాజమల్లు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో  బాధపడుతున్న ఆయన  సోమవారం హైదరాబాదులోని ప్రైవేట్ దవాఖానాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బిరుదు రాజమల్లు  హఠాన్మరణం పెద్దపల్లి జిల్లాలో విషాదం నింపింది. ఆయన సన్నిహితులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు , కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1930లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాజమల్లు.. తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ తో ప్రారంభించారు. అదే పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో అదే అభ్యర్థిని 39 వేల 677 ఓట్ల మెజార్టీతో మట్టికపిరిపించి తొలి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో బీఆర్ఎస్‌లో చేరారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతలోనే ఆయన అనారోగ్యం బారిన పడి మృతి చెందడం  పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు. ఈ మేరకు మంగళవారం సుల్తానాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజకీయ ప్రముఖులు  హాజరై నివాళులు అర్పించనున్నారు.