ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి...

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి...
  • పెద్దపల్లి జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యేలా అవగాహన కార్యక్రమాలు
  • సి.పి. రెమా రాజేశ్వరితో కలిసి ఓటర్ చైతన్య రథాన్ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు -2023 సందర్భంగా స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ అవగాహన కొరకు ఏర్పాటు చేసిన  ఓటరు చైతన్య రథాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్లను చైతన్యపరి చేందుకు, ఓటింగ్ శాతం పెరిగేలా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ఓటర్ చైతన్య రథాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటరు చైతన్య రథాలతో పాటుసాంస్కృతిక సారథి కళాకారుల బృందం జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగం, స్వేచ్ఛగా ఓటు వేయడం అంశాలపై కళారూపాలు ఆట, పాటలతో ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్య విధంగా ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గత ఎన్నికలలో తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు చేసిన గేయ, నాటిక ప్రదర్శనలను పరిశీలించిన జిల్లా కలెక్టర్  సాంస్కృతిక సారథి కళాకారులను అభినందించారు. 
ఈ కార్యక్రమంలో డిసిపి ఎం. చేతన, రిటర్నింగ్ అధికారులు వి.హనుమానాయక్, మధు మోహన్, ఏసిపిలు, స్వీప్ ఆక్టివిటీస్ జిల్లా నోడల్ అధికారి రవూఫ్ ఖాన్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.