పురుమల్ల కే కాంగ్రెస్ టికెట్ 

పురుమల్ల కే కాంగ్రెస్ టికెట్ 
  • కలిసి వచ్చిన బీసీ కార్డు
  • టికెట్ కేటాయింపులో చక్రం తిప్పిన కీలక నేత
  • సిగ్నల్ పాస్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పురుమల్ల శ్రీనివాస్ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పేరు ప్రకటించడమే మిగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న  బీసీ నాయకుడు పురుమల్లకు టికెట్ కేటాయింపులో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ లో బీసీల వ్యవహారం పై దుమారం రేగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుందని బీసీలకు తగిన ప్రాధాన్యత లేదంటూ బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. బీసీ నేతల బృందం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయం పై జాతీయ అధిష్టానం వద్దే తేల్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళగా రాష్ట్ర బీసీ నేతలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగిన విషయం విదితమే. అప్పటినుండి కాంగ్రెసులో బీసీ కార్డు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

ఈ అంశాన్ని అందిపుచ్చుకున్న పురుమల్ల శ్రీనివాస్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద తన అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ముఖ్య నేతతో చక్ర తిప్పినట్లు తెలిసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటూ బీసీ టికెట్ల కేటాయింపు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలైనా  వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాలకు బిసి టిక్కెట్లు ఖరారు చేయగా తుది జాబితాలో కరీంనగర్ నుండి పురుమల్ల శ్రీనివాస్  పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. టికెట్ కేటాయింపులో కీలకంగా వ్యవహరించిన బీసీ నేత శ్రీనివాస్ కు సూచించినట్లు వినబడుతుంది. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ కోసం పురుమళ్ళ శ్రీనివాస్ తో పాటు కొత్త జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేనేని రోహిత్ రావు పోటీపడ్డారు. వీరి అభ్యర్థిత్వాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేక కోణాల్లో పరిశీలన చేసింది. కొత్త జైపాల్ రెడ్డి టిక్కెట్ పై ఆశ వదులుకొని బీ ఆర్ స్ తీర్థం పుచ్చుకొనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ చివరి వరకు టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. అధిష్టానం పురుమల్ల వైపు మొగ్గు చూపడంతో ఆశలు వదులుకున్నారు.