ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం.. 

ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం.. 
  • ప్రజా సేవకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను
  • 24 గంటలు నా ఇంటి తలుపులు తెరచి ఉంచుతా..
  • దేవుని సన్నిధి లో ప్రమాణం చేసి స్థానిక మేనిఫెస్టో విడుదల చేసిన పొన్నం 

హుస్నాబాద్ ముద్ర న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని పొట్లపల్లి ఆలయంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేశారు. సోమవారం పొన్నం పొట్లపల్లి రాజ రాజేశ్వర ఆలయం లో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ అఫిడవిట్ లపై సంతకం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మిత్ర పక్షమైన్ సీపీఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక సమస్యల పై మాని ఫెస్టో ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తో విసిగి పోయిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద వానికి మేలు జరుగుతుందని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు.  అందుకే అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లను అమలు చేస్తామని, దైవ సన్నిధి లో ప్రమాణం చేసి, అఫిడవిట్ పై సంతకం చేసినట్లు తెలిపారు. ఇక్కడి ప్రాంత సమస్యలపై పూర్తిగా తనకు అవగాహన ఉందని, ప్రచార కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి తండాలో పర్యటించినట్లు పొన్నం తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నేరవేర్చెందుకు  హుస్నాబాద్ నియోజక అభివృద్దే ధ్యేయంగా స్థానిక మానిఫెస్టో ను విడుదల చేసినట్లు పొన్నం తెలిపారు. 

తోటపల్లి రిజర్వాయర్ వరదనీటి కాలువ ద్వారా, చిగురుమామిడి సైదాపూర్ మండలాల రైతాంగానికి,దేవాదుల ప్రాజెక్టు నుండి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతాంగానికి, ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తామని అన్నారు. వ్యవసాయదారిత పరిశ్రమలు నెలకొల్పుతామని హామీనిచ్చారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి తగు చర్యలు చేపడతామన్నారు. పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువు, సర్దార్ సర్వాయి పాపన్న గుట్టను, మహాసముద్రం గండిని, రాయికల్ జలపాతాన్ని,శనిగరం ప్రాజెక్టు, పర్యాటకులను ఆకర్షించే విధంగా సుందరీకరించి నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. హుస్నాబాద్ బస్సు డిపోను పూర్తిగా ఆధునికరించి ప్రతి పల్లెకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

హుస్నాబాద్ సభలో ప్రియాంక గాంధీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హామీతోనే హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి నాంది పడిందని పొన్నం పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ తో ఈ ప్రాంత వైద్య సేవలు మెరుగుపడతాయని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి తావు లేకుండా సేవలందిస్తానని చెప్పారు. 24 గంటలు తన ఇంటి తలుపులు తెరిచి ఉంచుతానని అన్నారు.  నియోజకవర్గంలోని 34 బూతుల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి లతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐసిసి సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్, అసెంబ్లీ పరిశీలకులు గోపీనాథ్ పలనియప్పన్, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, డిసిసి ప్రధాన కార్యదర్శి చిత్తారి రవి, వైస్ ఎంపిపి దేవసానీ నిర్మల - నరసింహారెడ్డి,సింగిల్విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.