బిఆర్ఎస్ కు ఆరేపల్లి రాజీనామ

బిఆర్ఎస్ కు ఆరేపల్లి రాజీనామ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అధికార బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.  అధికార పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు గురువారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, నాటి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థన మేరకు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు.  బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ సహకారం అవుతుందని భావించానని చెప్పారు.  తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, వారి ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయని తెలిపారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో బీసీలు, దళితులకు పూర్తిగా న్యాయం జరగలేదని చెప్పారు.  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.  మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి తోపాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడాలనే తపనతో ప్రజల గొంతుకగా మారాలనే ఉద్దేశంతో, అధికార పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. 

సుదీర్ఘ ప్రస్థానం... 
ఆరేపల్లి మోహన్ విద్యార్థి దశ నుండే ఎన్ ఎస్ యు ఐ నాయకునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మానకొండూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా 19 ఏళ్లపాటు పనిచేశారు. అనంతరం తిమ్మాపూర్ జెడ్పిటిసి సభ్యునిగా ఎన్నికైన ఆయన, జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. జెడ్పి చైర్మన్ గా రెండేళ్ళు పనిచేసిన అనంతరం 2019లో మానకొండూరు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. నాటి ప్రభుత్వంలో విప్ గా బాధ్యతలు నిర్వహించారు. 

కాంగ్రెస్ తో చర్చలు
అధికార పార్టీకి రాజీనామా చేసిన ఆరెపల్లి మోహన్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. శాసనసభ్యులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిసింది.  తొలుత అధికార పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయం మాట్లాడుకోవాలని వారు ఓ నిర్ణయానికి వచినట్లు తెలిసింది.  అయితే మానకొండూర్ నియోజకవర్గానికి సంబంధించి తన మిత్రులు, శ్రేయోభిలాషులతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం 15 రోజుల క్రితం అధికార పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.  విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరేపల్లి మోహన్ కు ఫోన్ చేసి ఆయనను బుజ్జగించారు.  దీంతో తాత్కాలికంగా రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న ఆయన, బీఆర్ఎస్ లో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని భావించి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.