కేసీఆర్‌‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి

కేసీఆర్‌‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  • మెడికల్‌ కాలేజీ ఏర్పాట్ల పరిశీలన
  • నేడు వర్చవల్‌ ద్వారా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌‌

ముద్ర ప్రతినిధి, జనగామ: సీఎం కేసీఆర్‌‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాం, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, సంబంధిత అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రత్యేక పథకాలను రూపకల్పన చేస్తున్నారన్నారు. విద్యా, వైద్యం, వ్యాపార తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే జనగామ జిల్లాకు వైద్య కళాశాలలను మంజూరు చేశారని తెలిపారు. 

100 సీట్లతో నిర్వహించే మెడికల్‌ కాలేజీని శుక్రవారం (నేడు) సీఎం కేసీఆర్‌‌ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారని తెలిపారు. కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలను జనగామ జిల్లా చంపక్ హిల్స్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు ప్రారంభ కార్యక్రమంలో వంద మంది విద్యార్థిని, విద్యార్థులు, వైద్య కళాశాల అధ్యాపకులు, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ గోపాలరావు, డీఎంహెచ్‌వో ప్రశాంత్ పాల్గొన్నారు.