నడిగడ్డ ప్రాంతంలో సరైన విద్య,వైద్యం అందించలేని పాలకులు ఎందుకు...?

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : 19వ రోజు నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో గొంగళ్ళ రంజిత్ కుమార్... గద్వాల:  నియోజకవర్గంలోని ఏ గ్రామం చూసినా అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా నెట్టి వేయబడ్డాయని ఈ ప్రాంతంలో సరైన విద్య,వైద్యం అందించలేని పాలకులు ఎందుకని గొంగళ్ల రంజీత్ కుమార్ ప్రశ్నించారు. 19వ రోజుకు చేరిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా మల్దకల్ మండలంలోని మద్దెలబండ, నేతువానిపల్లి, నేతువానిపల్లి తాండ, అడవి రావులచెర్వు ఉలిగేపల్లి, దాసరిపల్లి, బిజ్వారం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. మల్దకల్ లోని స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర తిమ్మప్ప  స్వామి దేవస్థానంలోని స్వామి వారిని గొంగళ్ల రంజీత్ కుమార్  దర్శించుకున్న అనంతరం పాదయాత్రకు సిద్ధమయ్యారు. మద్దెలబండ గ్రామ శివారులోని అక్కడే ఉన్న కూలీ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నడిగడ్డ ఆత్మగౌర పాదయాత్రలో మద్దెల బండ నేతువానిపల్లి,, ఉలిగేపల్లి,దాసరిపల్లి,బిజ్వారం గ్రామానికి విచ్చేసిన గొంగళ్ల రంజిత్ కుమార్ గారికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వీర తిలకం దిద్ది, డోళ్ల దరువులతో బాణసంచాతో ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ...
మండలంలోని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా మద్దెలబండ గ్రామంలో గొంగళ్ల రంజిత్ కుమార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న  సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో 70 ఏళ్ల కుటుంబ పరిపాలనలో నడిగడ్డ ప్రాంతంలో సరైన విద్య,వైద్యం లేక అనేక రకాలుగా పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల భవిష్యత్ విద్యతోనే ప్రారంభమౌతుందని అలాంటి పేద విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం హేయమైన చర్య అని ప్రశ్నించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని,తాగునీటి సమస్య, టాయిలెట్స్ తదితర సమస్యలను విద్యార్థులు గొంగళ్ల రంజిత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. భావితరాల్లో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మీపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని రాబోయే రోజుల్లో గద్వాల ప్రాంతం విద్య,వైద్యం, అభివృద్ధి, సంక్షేమం కొరకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు.
కుటుంబ పాలనలో అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని అలాంటి సమస్యలను పరిష్కరించకుండా కేవలం గ్రామాల వైపు కూడా కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉందని, మీ పరిపాలన ఏ అభివృద్ధి పనులు చేశారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటివరకు అర్హులైన వారికి అనేక గ్రామాలలో వృద్ధాప్య,వికలాంగు,వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా మరి ఆ పథకాలన్నీ కూడా ఎవరెవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని అన్నారు.

ఆయా గ్రామాలలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,లేక తాగునీటి సమస్యలతో గ్రామ ప్రజలు సతమతమవుతున్నారని ప్రజలకు మేలు చేయాల్సిన పాలకులు 70 ఏళ్ల నుండి మరి ఏం చేస్తున్నారో ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతా అంధకారంలో ఉందని అన్నారు. రాబోయే రోజులలో బహుజన నాయకత్వాన్ని నిలబెట్టడం కోసం ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ పేదవర్గాల తరపున ప్రశ్నించే గొంతుకగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,జిల్లా కార్యదర్శి లవన్న, నాయకులు నాగేష్, వీరేష్ అవనిశ్రీ, రంగస్వామి, పరశురాముడు, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు,ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, నజుముల్లా,కార్యదర్శి తిమ్మప్ప,గోపాల్, లక్ష్మన్న,ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షులు మునెప్ప,ఆంజనేయులు,గట్టు మండల అధ్యక్షుడు బలరాం,ఉపాధ్యక్షుడు దయాకర్, కార్యదర్శి నరేష్,నాయకులు ఆలూరు వెంకట్రాములు, జమ్మన్న,కె.టి.దొడ్డి మండల నాయకులు అంజి,ఏసు,భీమన్ గౌడ్,ఉపేంద్ర, రాము,ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.