రైలుతో సెల్ఫీకి యత్నించి మహిళ దుర్మరణం...

రైలుతో సెల్ఫీకి యత్నించి మహిళ దుర్మరణం...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-సెల్ఫీల కోసం యత్నించి యువత తమ ప్రాణాలను కోల్పోతున్నారు. డేంజర్ జోన్ లో సెల్పీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజగా మెక్సికోలోని హిడాల్గోలోని ఫేమస్ అయిన ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు వస్తున్న సమయంలో రైలుకు దగ్గరగా వెళ్లి సెల్ఫీ దిగడానికి యత్నించిన ఓ యువతిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మీడియా కథనాల ప్రకారం.. రైలు ప్రమాదంలో మృతిచెందిన మహిళ తన కుమారుడు చదువుకునే పాఠశాలకు సమీపంలో ట్రైన్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ పై 1930లో నిర్మించిన ‘ఎంప్రెస్’ అని పిలవబడే స్టీమ్ రైలు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఈ ట్రైన్ ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడి ఆ రైలుతో ఫోటోలు, సెల్పీలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు.

ఈ క్రమంలోనే హిడాల్గో సమీపం వద్ద ఈ స్టీమ్ రైలును చూసేందుకు అనేక మంది తరలి రాగా తన కుమారుడితో పాటు మృతి చెందిన మహిళ కూడా వచ్చారు. అయితే అత్యుత్సాహంతో ఆమె ట్రాక్ కు సమీపంలో నిలబడి ట్రైన్ తో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించింది. వెనుక వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన ట్రైన్ ఆమెను ఢీకొట్టింది. మహిళ తల భాగాన్ని రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో రెప్పపాటులో ఆ మహిళ కుప్పకూలి పోయింది. అందరూ చూస్తుండగానే ప్రాణాలు విండిచింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఉన్న ఉల్లాసభరిత వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కళ్ల ముందే యువతి ప్రాణాలు కోల్పోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.