కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు

కిడ్నీ మార్పిడి చేసి ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు

ముద్ర.వనపర్తి:-వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ సాయి ఆసుపత్రి నిర్వాహకులు యాదాచారి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనకు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ (మలక్ పేట) యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్ తెలిపారు. గురువారం యశోద ఆసుపత్రి వైద్యులతో పాటు మార్కెటింగ్ సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు ఎనిమిది నెలల క్రితం వనపర్తికి చెందిన డాక్టర్.యాదాచారి డయాబెటిస్ తో బాధపడుతూ ఒక కిడ్నీ పాడైపోగా డయాలసిస్ చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో దానిని ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు జీవన్ దాన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేశామన్నారు.

ఆ తర్వాత మ్యూకోర్మైకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ (బ్లాక్ ఫంగస్) వచ్చి ముక్కు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ రోగి 95 శాతం ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఇఎన్టి, శ్వాస సంబంధిత వైద్యుల బృందంతో కలిసి శస్త్ర చికిత్స చేసి రెండు వారాలపాటు మెరుగైన వైద్యం అందించడంతో యాదాచారి బ్రతికి బయటపడ్డాడని, ఇలాంటి జబ్బు బారిన పడిన వారు ఐదు శాతం వరకే బ్రతికే అవకాశం ఉందన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితికి రోగితోపాటు రోగి బంధువులు కూడా తమ వైద్య బృందానికి సహకరించడం చాలా అరుదు అని ఆయన తెలిపారు. యాదాచారి 61 సంవత్సరాల వయస్సులో కోలుకోవడం చాలా అరుదైనదిగా చెప్పవచ్చని అన్నారు. యశోద ఆసుపత్రిలో అన్ని రకాల జబ్బులకు చికిత్సలతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తామని వివరించారు. జర్నలిస్టులకు జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉంటే 30% వెసులుబాటుతో పరీక్షలు చేస్తామని చెప్పారు. వనపర్తిలో జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు చేసేందుకు యశోద ఆసుపత్రి వైద్యుల బృందం సిద్ధంగా ఉందని, సమయం చెబితే తాము వచ్చి జర్నలిస్ట్ లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ కే. శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ ఇన్చార్జ్ వాసు కిరణ్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.