మణుగూరులో జీరో దందా..

మణుగూరులో జీరో దందా..

నాణ్యత లేని జీరో అమ్మకాలు సాగిస్తూ..ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా.అడిగే నాథుడు లేక కొంతమంది వ్యాపారస్తుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.కరోనా సమయంలో ప్రజల అత్యంత అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రేట్లను అమాంతంగా పెంచేశారు.

కాలం చెల్లిన సరుకులకు సైతం కొత్త స్టిక్కర్లు అంటించి అమ్మేశారు. మార్జిన్‌ ఎక్కువ వచ్చే నాసిరకమైన బ్రాండ్లను తెచ్చి రెట్టింపు ధరలకు అమ్మిన దాఖలాలు లేకపోలేదు. కరోనా సమయంలో బిల్లులు లేకుండా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన కొన్ని బ్రాండ్ల సరుకులను నేటికీ కొన్ని ఏజెన్సీల వ్యాపారులు మార్కెట్లో గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సమాచారం కొన్ని సరుకులకు మాత్రమే బిల్లులు చూపిస్తూ తమ జీరోదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రెండు, మూడో రకం సరుకులను అంతగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఎంతమంది వినియోగదారులకు దుకాణాదారులు బిల్లులు ఇస్తున్నారు. సరుకులు కొనే ముందు జి.ఎస్‌.టి పేరుతో వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేసే దుకాణాదారులు ఎంతమంది సరుకులు కొనేవారికి జి.ఎస్‌.టి తో కూడిన ఒరిజినల్‌ బిల్లులు ఇస్తున్నారు. రూ. కోట్లల్లో వ్యాపారం చేసేవారు రూ. వేలల్లో... రూ. లక్షల్లో వ్యాపారం చేసే వారు రూ. వందల్లో మాత్రమే అమ్మకాలు చూపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. అటు ప్రభుత్వాన్ని.. ఇటు జనాలను మోసం చేస్తూ వ్యాపారాలు చేసే వారెక్కువయ్యారు.

ప్రముఖ పారిశ్రామికమైన మణుగూరు పట్టణంలో జీరో దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మణుగూరులోని ప్రముఖ వ్యాపార సంస్థలపై ఏకకాలంలో జరిగిన ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం సృష్టించాయి. అకస్మాత్తుగా మణుగూరులో ఐటీ దాడులు జరగడంతో కొందరు బడా వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. ఐటీ దాడులతో కొందరు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు సంపాదించడం జీరోదందా కూడా ఒకమార్గమనే తెలుస్తోంది.కరోనా మహమ్మారితో ప్రపంచమే అతలాకుతమైతే...కొందరు కిరాణా వ్యాపారస్తులకు కాసులు కురిపించింది. మణుగూరులోనే రూ. కోట్లల్లో జీరోదందా యథేచ్ఛగా సాగిందని బహిరంగంగా చెప్పొచ్చు.