సునీతా రెడ్డికే బిఆర్ఎస్ బి-ఫాం

సునీతా రెడ్డికే బిఆర్ఎస్ బి-ఫాం
  • నర్సాపూర్ లో ఉత్కంటకు తెర

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వి.సునీత లక్ష్మారెడ్డిని ప్రకటిస్తూ పార్టీ అధినేత, సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు బుధవారం ఆమెకు బీఫాం అందజేశారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా మంత్రి హరీష్ రావుతో పాటు నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సైతం ఉన్నారు.

నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంటకు తెర పడింది. మాజీ మంత్రి, ప్రస్తుతం మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా ఉన్న వి. సునీతా రెడ్డికి టికెట్ కేటాయించారు. 1999, 2004,2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్ర. మంత్రిగా పనిచేశారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా, 2014 మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల ముందు టిఆర్ఎస్ లో చేరారు. తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయ్యారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన సునీతారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యాయించారు. తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటు ముందుకు సాగారు.

మదన్ రెడ్డి సహకరించేనా

నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా రెడ్డిని ఖరారు చేయగా పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఎంత వరకు సహకరిస్తారనేది చర్చనీయంశంగా మారింది. ఆగస్టు 21న కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుండి మధన్ రెడ్డి తాను ఎట్టి పరిస్థితిలో పోటీలో ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల నియోజకవర్గంకు చెందిన చిలుముల కుటుంబానికి చెందిన మాజీ ఎంపిపి సుహాసిని రెడ్డి, ఆమె కుమారుడు చిలిపిచెడ్ జెడ్పిటిసి పదవికి రాజీనామా చేసిన శేషసాయి రెడ్డి త్వరలో పార్టీ మారే అవకాశం ఉంది. మైనంపల్లి హన్మంత్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.బిజెపి ఇప్పటికే నర్సాపూర్ అభ్యర్థిగా మురళీయాదవ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బిఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా రెడ్డిపేరును ఖరారు చేస్తు బిఫాం అందజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.