బీసీ బంధు ప్రకటించాలి-చేతి వృత్తుల కుటుంబానికి 5లక్షలు ఇవ్వాలి

బీసీ బంధు ప్రకటించాలి-చేతి వృత్తుల కుటుంబానికి 5లక్షలు ఇవ్వాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  బిసి కుల వృత్తులకు రూ. లక్ష కాదు బీసీ బంధు ప్రకటించి, చేతి వృత్తుల కుటుంబానికి రూ. 5లక్షలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.  ప్రపంచీకరణ వ్యవస్థలో చేతివృత్తులు కనుమరుగై పోతున్న తరుణంలో కుల వృత్తుల వారికి చేయూతనిచ్చి ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని కులాలకు మాత్రమే కొన్ని అభివృద్ధి పథకాలు అందించి మిగతా కులాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గడచిన పాలనలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో చేతి వృత్తి పనివారలు బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని అన్నారు. ఇంతకాలం బీసీల్లో కొన్ని కులాలకు మినహా చేతి వృత్తి ఆధారిత కులాలకు ఎటువంటి ఉపయుక్తమైన పథకాలు ప్రకటించకపోవడం శోచనీయమని, రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల ఓట్లు దండుకోవడానికి తెరాస ప్రభుత్వం మరోసారి నూతన పథకాల ఆశ చూపిస్తూ మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ , ఇప్పుడు కొత్తగా చేతివృత్తుల వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని కుటుంబానికి కేటాయించే లక్ష రూపాయలు ఏ కోశానా సరిపోతాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.