కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ములుగు ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ములుగు ఎమ్మెల్యే సీతక్క
  • నాడు స్వాతంత్య్రం తెచ్చింది-నేడు తెలంగాణ ఇచ్చింది.
  • కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి - ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: నాడు స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, నేడు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఆలోచించి, ఆదరించి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సింగరకుంటపల్లి, పాపయ్యపల్లి, నర్సాపూర్, కేశవాపూర్ గ్రామాలలో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రచార కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క పాల్గొని, గడపగడపకు ఆరు గ్యారెంటీ లను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. త‌న‌ను ఓడించేందుకు కుట్ర‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు. అయినా ప్ర‌జ‌లు త‌న వైపు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రికి ఓటు వేస్తే బాగుంటుంద‌ని అనుకుంటారో వారికే ఓటు వేయాల‌ని చెప్పారు. క‌రోనా క‌ష్ట కాలంలో, వ‌ర‌ద‌లు చుట్టు ముట్టిన‌ప్పుడు ఎవ‌రు మీకు సేవ‌లు అందించారో ఒక్క‌సారి గుర్తు చేసుకోవాల‌ని కోరారు. ముందు నుంచీ కేసీఆర్ కు త‌నంటే ప‌డ‌ద‌న్నారు. ఎందుకంటే తాను ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతాన‌ని, ఆయ‌న‌కు వంగి వంగి స‌లాం చేసే వాళ్లు కావాల‌న్నారు. తాను ఏనాడూ ఎవ‌రిని బెదిరించలేద‌న్నారు. ఎన్ని కుట్ర‌లు చేసినా ఎగిరేది ములుగులో కాంగ్రెస్ పార్టీ జెండానేన‌ని అన్నారు. పోడు భూముల గురించి నిల‌దీశాన‌ని, త‌న‌కు ఎదురే లేకుండా, ప్ర‌శ్నించ‌కుండా ఉండేందుకు త‌న‌ను ఓడించాల‌ని ప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపించారు. దోచుకున్న సొమ్మును దాచు కోవ‌డ‌మే బీఆర్ఎస్ పార్టీ ప‌ని అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. నన్ను ఓడించడానికి బీఆర్ఎస్ ముఖ్యనేతలు కోట్లు కుమ్మరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల తీర్పుతో కేసిఆర్ పదేండ్ల అహంకారం పోవాలని, కాంగ్రెస్ పార్టీ రావాలని పిలుపునిచ్చారు.

గడిచిన 18ఏళ్ల కేసిఆర్ పాలనలో పేద ప్రజలకు చేసింది ఏమి లేదని, హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కేసిఆర్ ను గోతి తవ్వి పాతి పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసిఆర్ బినామీ లు నన్ను ఓడించడానికి వందల కోట్ల రూపాయలు పట్టుకొని ములుగుకు వచ్చి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ ములుగు నియోజక వర్గం లో ఎన్నడూ లేని విధంగా మద్యం, డబ్బులతో ఓట్లు కొందామని వస్తున్నారని, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ఏ రాజకీయ నేపథ్యం ఉందని ప్రశ్నించారు. రెండు సార్లు ఎమ్మెల్సీ అయింది డబ్బులతోటి కాదా, ఒక్కసారి ములుగు ప్రజలు ఆలోచన చెయ్యాలని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులకు రీతి నీతి ఉంటే మద్యం, డబ్బులు పంచకుండా ప్రజల్లోకి రావాలని, అప్పుడు ఎవ్వరి దమ్ము ఎంటో తెలుస్తుందని, నేను ప్రజల కోసం నా బాల్యం లోనే అడవి బాట పట్టినానని, ఆయుధాన్ని ఎక్కుపెట్టి నా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఉద్యమములో పని చేయడం జరిగిందన్నారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం ప్రభుత్వం పై పోట్లాట చేయడం, ప్రశ్నించే గొంతుకనై ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాటం చేయడం నేను చేసిన తప్పా అంటూ విరుచుకుపడ్డారు. ములుగు వచ్చి నన్ను ముఖ్యమంత్రి కేసిఆర్ పంపించిండు అని ప్రగల్భాలు పలుకుతున్నారని, నేను ప్రజలను నమ్ముకున్నానని, వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారని చివరికి గెలిచేది ప్రజలే అనేది మరిచిపోవద్దు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంఘాల జిల్లా, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.