రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య వైపు అడుగులు వేసిన రోజు

రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య వైపు అడుగులు వేసిన రోజు
  • అన్ని రంగాల్లో తెలంగాణా అభివృద్ది
  • సిరిసిల్ల లో జాతీయ సమాఖ్యత దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ సమైఖ్య త దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ర  ప్రణాళీక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడారు.  1948, సెప్టెంబర్ 17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజని.. 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై ఎండ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు.

సిఎం కేసీఆర్ కృషితో దార్శనిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఇలా ఐటీ నుంచి అగ్రికల్చర్‌ వరకూ అన్ని రంగాలలో యావత్ భారతావనికే దిక్సూచిగా నిలిచింది. స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి 10 ఏళ్లలోకి అడుగిడిన  సందర్భాన్ని ఒక్కసారి తరిచి చూసుకుంటే ఎంతో గర్వంగా ఉంది.  ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు పర్యావరణం, ఒకవైపు పల్లె ప్రగతి, మరోవైపు పట్టణ ప్రగతి, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం ఇలా అందరిని కడుపులో పెట్టుకుంటూ సబ్బండవర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.రైతుబంధులాంటి విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకువచ్చిన దళిత బంధు లాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చిన అది సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైందని మనందరికీ తెలుసు. ఈ పదేండ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మన విజయాలెన్నో కంటిముందు కనిపిస్తాయి. నేడు కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల విద్యుత్తు సరఫరా, మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, బీసీ గ్రాంట్ , డబుల్‌ బెడ్రూం ఇండ్లు, చేప పిల్లల పెంపకం, గొర్రెల పంపిణీ, సెలూన్లు, ధోబీ ఘాట్ల కు ఉచిత విద్యుత్తు, అన్ని వర్గాలకు గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు, మన ఊరు – మనబడి, కేసీఆర్‌ కిట్‌, బస్తీ దవాఖానాలు, పల్లె, పట్టణ ప్రగతి, టీఎస్‌ ఐ పాస్‌, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. వ్యవసాయానికి  నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ వంటి వినూత్న పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగం సుసంపన్నమైంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఈ తొమ్మిది ఏళ్లలో 26 మెడికల్ కాలేజీలను ఇప్పటికే  ఏర్పాటు చేసుకున్నాం. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు 33 నర్సింగ్ కాలేజీలు పెట్టాలన్న లక్ష్యంకు అతి చేరువలో ఉన్నాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మెడికల్, నర్సింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. జిల్లాకు ఒక  మెడికల్ కళాశాల ఏర్పాటుతో లక్ష జనాభాకు అత్యధిక మెడికల్ సీట్లు 22 కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నేడు దేశానికి సరికొత్త దిశా దశను నిర్దేశించింది. సిఎం కేసిఆర్ ఆశీస్సులు, మంత్రి శ్రీ కే తారక రామారావు మార్గదర్శనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని విధాలుగా స్వల్పకాలంలోనే  శరవేగంగా అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా  సాగుజలాలు, భూగర్భ జలాల లభ్యత పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016 లో ఉన్న 1 లక్షా 77 వేల 960 ఎకరాలలో నికర సాగుభూమి కాస్త 2023 నాటికి  2 లక్షల 40 వేల 430 ఎకరాలకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ప్యాకేజి-9 మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలే విజయవంతం అయింది. దీని ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 96 వేల 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 3 వేల 443 ఇండ్లు పూర్తి చేశాం. అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తూ దేశానికే సరికొత్త పంథాను నిర్దేశిస్తున్నాయి. సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే  “గృహలక్ష్మి”  పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో ఈ సంవత్సరం నియోజకవర్గంకు 3 వేల ఇండ్ల చొప్పున ప్రభుత్వం   మంజూరు చేసింది. తరతమ  భేదం లేకుండా గుడిసెల్లో నివసిస్తున్న వారికి, శిథిలావస్థలో ఇండ్లున్న వారికి  ఇండ్ల మంజూరులో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నమన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 22 వేల 95 మందికి 201 కోట్ల 96 లక్షల 64 వేల రూపాయలు, షాదీ ముబారక్ పథకం ద్వారా 1 వేయి 17 మందికి 9 కోట్ల 1 లక్షా 61 వేల రూపాయల ఆర్థిక సహాయంగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది.  
విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. జిల్లాలో ఐటీఐ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, డా.బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పెంపుదలకు కృషి చేస్తుండగా తాజాగా  ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ, విద్యార్థుల కోసం “సీఎం అల్పాహార పథకం” దసరా కానుకగా ప్రారంభించనుంది.  సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే.. గాలిలో దీపం అన్నట్లు ఉండేది. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి కొత్త రూపు వచ్చింది.  నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆసుపత్రికెళితే ఒక ధైర్యం అనే భరోసాను ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ కిట్ల నుంచి...న్యూట్రిషన్ కిట్ల దాకా... డయాలసిస్ కేంద్రాల నుంచి... డయాగ్నోస్టిక్ కేంద్రాల వరకు... పల్లె, బస్తీ దవాఖానా నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ప్రతీ నిర్ణయం తెలంగాణ వైద్యారోగ్య రంగ ప్రస్థానంలో విప్లవాత్మక మార్పులకు కారణం అయ్యింది. ఫలితంగా  "నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు" అనే దశాబ్దాల దుస్థితి నుంచి... "చలో పోదాం పదరో సర్కారు దవాఖానకు" అనేలా రోగులకు తెలంగాణ సర్కార్  ధీమానిచ్చింది. మాత శిశు మరణాల రేటును భారీగా తగ్గించడం ప్రభుత్వం సాధించిన మానవీయ విజయమన్నారు. ఇప్పటికే సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలకు తోడు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభించుకున్నాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన వైద్యులు స్థానికంగానే ఉంటూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నారు. తద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు దూరభారం, ఆర్థిక భారం తగ్గనుంది.     రైతుల మాదిరిగానే  నేతన్నలకు బీమా ఇస్తున్నాం..  దీన్ని త్రిఫ్ట్‌ పథకానికి లింక్‌ చేసి 75 ఏండ్లు దాటిన  చేనేత  కార్మికులకు  ప్రభుత్వమే  బీమా  కల్పిస్తుంది. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60 మంది నేత కార్మికులు, 4 వేల 644 మంది మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా పథకంలో నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ పథకంలో నమోదై మరణించిన 10 మంది నేతన్నల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేసిందన్నారు..  రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని,  తెలంగాణ సమైక్యత దినోత్సవం సాక్షిగా జాతీయ సమైక్యత సమగ్రతను చాటేలా యావత్ భారతావనికే తెలంగాణను రాజన్న సిరిసిల్ల దిక్సూచిగా నిలవాలని కోరుతున్నానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, వివిధ సంస్థల చైర్మన్లు, వైస్ చైర్మన్లు  చిక్కాల రామారావు. గూడూరి ప్రవీణ్, సిద్దం వేణు,గడ్డం నర్సయ్య, జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.