పదవ తరగతి పరీక్ష కేంద్రం, ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

పదవ తరగతి పరీక్ష కేంద్రం, ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

బీబీనగర్ ముద్ర న్యూస్ : పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్య కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ఆయన బీబీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కిడ్స్ కింగ్డమ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలో ఇంకా కొన్ని చోట్ల అదనంగా ఫ్యాన్స్ అవసరముందని, వెంటనే ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డిని ఆదేశించారు.

ఆరోగ్య మహిళా కేంద్రాలలో అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గ్రామాలలో ప్రతి మహిళకు తెలిసేలా క్షేత్రస్థాయిలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఆయన సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రంలో థైరాయిడ్, షుగర్ కంప్లీట్ యూరిన్ టెస్ట్, క్యాన్సర్ స్క్రీనింగ్, మూత్ర నాళ సంబంధిత పరీక్షలతో సహా నిర్దేశించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు, ప్రతి మంగళవారం దాదాపు వంద మంది వరకు మహిళలు పరీక్షలకు వస్తున్నట్లు వైద్య అధికారి వివరించారు.

వేసవి దృష్ట్యా పరీక్షల నిమిత్తము వచ్చే మహిళల కోసం అదనంగా టెంట్, మంచినీరు ఏర్పాట్లు నిర్వహించాలని, అలాగే ప్రతి మంగళవారం నాడు మహిళలకు ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలపై గ్రామాలలో ప్రతి మహిళకు తెలిసేలా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీ వాణి, డిప్యూటీ వైద్య అధికారి డాక్టర్ శిల్పిని, డాక్టర్ యామిని, డాక్టర్ ఇందిర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు..
కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ఆయన సందర్శించి కంటి పరీక్షల విధానాన్ని పరిశీలించారు.

వేసవి దృష్ట్యా నర్సరీలలో మొక్కలు దెబ్బతినకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారికి సూచించారు. బీబీనగర్ మండలం రాఘవపురం  నర్సరీని ఆయన పరిశీలించారు. ఇంటింటికి పూల మొక్కలు పంపిణీ చేయవలసి వున్నందున నర్సరీలలో మొక్కల ఎదుగుదల బాగుండాలని, అలాగే గ్రామ పంచాయితీలలో అవెన్యూ ప్లాంటేషనుపై శ్రద్ధ కనబరచాలని, సకాలంలో వాటరింగ్ చేపట్టాలని, మొక్కలు ఎండిపోకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, ఎంపిటిసి అండాళు, తదితరులు పాల్గొన్నారు.