ఎన్నికల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు

ఎన్నికల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.    బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించే సాధారణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో చేపడుతున్న పనులను జిల్లా ఎస్పి ఎన్.కోటిరెడ్డి తో కలిసి  క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ బుధ వారం పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలన్నారు.   టాయిలెట్స్ సౌకర్యాలతో పాటు నీటి సరఫరాకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, పోలింగ్ ఏజెంట్లకు వాహనాల పార్కింగ్ స్థలానికి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన మీడియా కేంద్రం  ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ...  ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియామవలిని అనుసరిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలన్నారు. ఓటర్లను మభ్య పెట్టే విధంగా డబ్బులు, మద్యం, వస్తువులను పంపినీ చేస్తున్నట్లుగా తెలిస్తే సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి  ఉల్లంఘనలకు పాల్పడిన ఫిర్యాదు చేయాలన్నారు. 
సి-విజిల్ ఆప్ ను  డౌన్ లోడ్ చేసుకొని దాని ద్వారా ఎలాంటి ఫిర్యాదులైన చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఫారం 12డి ద్వారా ఓటు వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నవారికి తమ ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  
    ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గం  రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి  నామినేషన్ల ప్రక్రియపై  రిటర్నింగ్ అధికారి విజయ కుమారిని అడిగి తెలుసుకున్నారు.   కలెక్టర్ క్షేత్రస్థాయి సందర్శనలో మున్సిపల్  కమిషనర్ శ్రీనివాసన్, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇఇ బి సురేందర్, పోలీస్  అధికారులు పాల్గొన్నారు.