తిపన్నపేట గ్రామంలో రైతులు రాస్తారోకో

తిపన్నపేట గ్రామంలో రైతులు రాస్తారోకో

ట్రక్ షీట్ తో రైతులను దగా చేస్తున్నారు
తూకం వేసిన తర్వాత కోత విధించడం దారుణం
ఎక్కడి దాన్యం కుప్పలు, దాన్యం బస్తాలు అక్కడే ఉన్నాయి
తిప్పన్న పేటలో రైతుల రాస్తారోకోలో  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధాన్యం తూకంలో జాప్యం..అదనపు తూకం,  ధాన్యం బస్తాల రవాణాలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల రూరల్ మండలం తిపన్నపేట గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల రాస్తారోకోకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్సీ  మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపుతూకంతో పాటు రైస్ మిల్లర్ల వద్ద కోత విధిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు, ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. ధాన్యం తరలించాలని లారీలు పంపాలంటూ రైతులు ధర్నా చేయడం రైతుల దినస్థితికి అర్ధం పడుతుందన్నారు.ధాన్యం సేకరణ కమిషన్ తో మనుగడ సాగిస్తున్న ఐకెపి ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. ధర్మకాంటపై తూకం వేసిన తర్వాత ట్రక్ షీట్ పేరిట రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా రైతుల ఇబ్బందులపై అధికారులు చెబుతున్న మాటలకు కార్యాచరణకు పొంతన లేదని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో కల్లంకాడనే ధాన్యం తూకం వేసామని గుర్తు చేశారు. తప్పా, తాలు కోతలు లేకుండా ధాన్యం సేకరించామన్నారు.తిప్పన్నపేట రైతుల రాస్తారోకోతోనైనా కనువిప్పు కలగాలని, జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని  ధాన్యం బస్తాలను తరలించేందుకు తక్షణమే లారీలను పంపించి ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతులకు చెల్లింపులు చేయాలని  జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.