బిఆర్ఎస్ లో ఫ్లెక్సీల లొల్లి పై మంత్రి ఆరా!

బిఆర్ఎస్ లో ఫ్లెక్సీల లొల్లి పై మంత్రి ఆరా!

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా కేసముద్రం మండల కేంద్రంలో బారాస ఫ్లెక్సీల లొల్లి పై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరా తీశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ను ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించిన అంశాన్ని మంత్రికి వివరించినట్లు సమాచారం. ఫ్లెక్సీలో మేజర్ పంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఫోటో లేకపోవడం, తొలగింపుకు కారణమని తెలుసుకున్న మంత్రి మరోసారి ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చూస్తామని, తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇవ్వాల్సిన గౌరవం కచ్చితంగా ఇస్తామని సర్పంచ్ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారని సమాచారం. జరిగిందేదో జరిగిపోయింది, మనసులో పెట్టుకోకండి, కలిసికట్టుగా ఎన్నికల్లో తిరిగి బారాస విజయం సాధించేందుకు కృషి చేయాలని, సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించినట్లు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.