తెలంగాణకు క్రీస్తుకు పూర్వం నుంచే అభివృద్ధి చెందిన నాగరికత ఉంది - ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

తెలంగాణకు క్రీస్తుకు పూర్వం నుంచే అభివృద్ధి చెందిన నాగరికత ఉంది - ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
  • కరువు కాటకాలతో అల్లాడుతున్న, నిత్య వలసలతో జీవకల కోల్పోయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణమ్మ జలాలు
  • జాతీయ స్థాయిలో సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న పాలనకు గీటురాళ్లు
  • జిల్లా యావత్తు ప్రజానీకానికి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి భూస్వాముల, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు తెలిపారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు ప్రజా ప్రతినిధులకు నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రముఖులకు, ముఖ్యంగా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ బాలరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ తరఫున తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 
ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు. క్రీస్తు పూర్వం నుంచే ఈ  గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది. వేల ఏండ్ల చరిత్రలో ఎంతోమంది పాలించారు. భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులను ఎదిరించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు. అందులో ముఖ్యమైనదే 1946 లో ప్రారంభమయిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అప్పటి పోరాటంలో ఎందరో ప్రాణాలను కోల్పోవడం జరిగిందని, ఒక వైపు రైతాంగ పోరాటం జరుగుతున్న సమయంలోనే 1947 లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1947 నాటికి 500 సంస్థానాలు ఇండియన్ యునియన్ లో కలిసిపోయాయి కాని హైదరాబాద్,జునాఘడ్, కాశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయి. అప్పటి హైదరాబాద్ సంస్థాన పాలకులు తన పాలనలో ఉన్న తెలంగాణ లోని అప్పటి 8 జిల్లాలు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, అత్రఫ్ బల్డా (హైదరాబాద్), మహారాష్ట్ర లోని నాందేడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, పర్బనీ, బీడ్, కర్ణాటక లోని గుల్బర్గా, బీదర్, రాయచూర్ ను కలిపి ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 

కాని సంస్థానం లోని ప్రజలకు మాత్రం ఆనాటి వీరయోధుల త్యాగఫలంతో భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి మువ్వన్నెల జెండా రెపరెపలాడింది అన్నారు. అందుకు నిదర్శనంగానే తెలంగాణ జాతీయ దినోత్సవ వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలోనూ సువర్ణాక్షరాలతో లిఖించదగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో అద్భుతమైన ప్రగతిశీల విజయ వీచికలను సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు.

కృష్ణ జలాలు కరువు కాటకాలతో అల్లాడుతున్న, నిత్యం వలసలతో జీవకల కోల్పోయిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు, ఫ్లోరైడ్ విడత ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించి,12.30 లక్షల ఎకరాలకు సాగునీరు పల్లీలకు తాగునీరు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్లు అందించే  బృహత్వర పథకాన్ని నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా అలరారుతు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంత కుమారి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ కే మనోహర్, అదనపు ఎస్పీలు రామేశ్వర్, భరత్, అదనపు కలెక్టర్ సీతారామారావు, కలెక్టర్ సతీమణి మహేశ్వరి ఉదయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, కార్యక్రమ వ్యాఖ్యాత గుడిపల్లి నిరంజన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.