పస్తులుంటున్నామని రోడ్డెక్కిన హాస్టల్ స్టూడెంట్స్. - చిట్యాలలో ధర్నా, రాస్తారోకో..

పస్తులుంటున్నామని రోడ్డెక్కిన హాస్టల్ స్టూడెంట్స్. - చిట్యాలలో ధర్నా, రాస్తారోకో..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: సమయానికి తమకు భోజనం లేక పస్తులు ఉంటున్నామని హాస్టల్ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. అర్ధాకలితో అలమటిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని చిట్యాలలో ఆదివారం ధర్నా రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో  విద్యార్థినులకు గత రెండు రోజులుగా టిఫిన్, భోజనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆవేదన చెందారు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థినులు ఒక్కసారిగా రోడ్డెక్కినిరసన చేపట్టారు. చౌరస్తాలో ప్రధానరోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. తమకు సకాలంలో అల్పాహారము, భోజనం అందించకుడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గురుకులల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే కార‌ణంగా వారు వంటలు చేయడం లేదని దీంతో తాము పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. స్టూడెంట్స్ ధర్నాకు స్థానిక బీజేపీ నాయకులు బుర్ర వెంకటేష్ గౌడ్, గజనాల రవీందర్ తదితరులు మద్ధతు తెలిపి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.