వాతావరణ శాఖ హెచ్చరించిన పట్టించుకోని పాలకులు

వాతావరణ శాఖ హెచ్చరించిన పట్టించుకోని పాలకులు
  • రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే వరదల వల్ల భారీ నష్టం
  • వరదలు నష్టాన్ని నివారించడంలో విఫలమైన ప్రభుత్వం
  • వరదల్లో కొట్టుకుపోయిన వరి ,పత్తి పంటలకు ఎగరాకు 25 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం అందించాలి.
  • సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి ముద్ర: రాష్ట్ర ప్రభుత్వాన్ని  వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల, నూతనకల్, తిరుమలగిరి తదితర మండలాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడారు. వరి నాట్లు వేసే తరుణంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలకు వేసిన నాట్లు కొట్టుకు పోయాయని అలికిన  వరి విత్తనాలు వరద నీటిలో వెళ్లిపోయాయని రైతులకు జరిగిన భారీ నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి ఎకరాకు 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు ఇంటికి పదివేల రూపాయల చొప్పున ఏ విధంగా నష్టపరిహారం అందించారో ఇప్పుడు గ్రామాలలో వరదలు వచ్చి పంట నష్టపోయిన రైతులకు అదే విధంగా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ముందు చూపు లేని విధానం వల్లనే తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెరువుల మరమ్మత్తులు చేపట్టకపోవడం వల్ల కట్టలు తెగిపోయాయని రోడ్లకు అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవడం వల్ల వరద నీటికి రోడ్లు తెగిపోయాయని వరదల్లో రైతులు.., రైతు కూలీలు కొట్టుకుపోయారని దీనంతటికీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు .అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం దుఃఖసాగరంలో మునిగిందని ప్రభుత్వం రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకొని తిరిగి వ్యవసాయం చేసుకునే విధంగా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేలాది రూపాయల పెట్టుబడులు వరి , పత్తి చేలలో పెట్టారని నేడు పంటలు వరద పాలయ్యాయని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో చెరువు కట్ట తెగిపోయి పెను ప్రమాదం జరిగి ఉండేదని అప్రమత్తమైన ప్రజలతో కలిసి కట్టకు ఇసుక బస్తాలు వేశామని అలుగు రాళ్ళను తొలగించామని దీనితో ప్రమాదం తప్పిందని అన్నారు. ఇదే విధంగా మిగతా మండలాల్లోని గ్రామాల్లో సైతం ఇలాంటి ప్రమాద పరిస్థితిలో నెలకొన్నాయని అయినా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. తుంగతుర్తి మండలం సంగం బంధం పై బ్రిడ్జి లేకపోవడం అలాగే వెలుగుపల్లి, కేశవాపురం మధ్య బంధానికి బ్రిడ్జి లేకపోవడంతో రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

గతంలోనే నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని నేడు వర్షాల కారణంగా మరింత పాడయ్యాయని తక్షణమే రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం నేడు సంభవించిన వరదల విషయంలో తక్షణమే మాట్లాడాలని రైతులను నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు వెంట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నగర్ గారి ప్రీతం కుమార్ ,మద్దిరాల మండలాధ్యక్షులు ముక్కాల విలమల్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.