ఖరీఫ్ సీజన్ ప్రారంభ మాయే - వర్షాల జాడ లేకపాయే

ఖరీఫ్ సీజన్ ప్రారంభ మాయే - వర్షాల జాడ లేకపాయే
  • అయినా జోరు అందుకున్న విత్తనాలు కొనుగోళ్లు
  • తూతూ మంత్రంగా తనిఖీలు
  • దుకాణాల ముందు కనిపించని స్టాక్ బోర్డులు

తుంగతుర్తి ముద్ర: పత్తి ,వరి విత్తనాల అమ్మకాలు ఒకపక్క జోరుగా సాగుతున్న రైతులు కొనుగోలు చేస్తున్న విత్తనాలు నాణ్యమైనవా ,కావా అనే విషయాన్ని తనిఖీ చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటివరకు విత్తనాల అమ్మకం దుకాణాల లో తనిఖీలు చేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమై సుమారు పక్షం రోజులు కావస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే దుకాణాల్లోని విత్తనాలను పరిశీలించాల్సిన అధికారులు, ఆ దిశగా తనిఖీలు ఏవి చేయలేదని సమాచారం. ప్రతి ఏడాది ముందుగానే తలిఖీలు తూతూ మంత్రంగానే చేసినట్లు తమ రికార్డుల్లో రాసుకోవడం తప్ప తనిఖీలు మాత్రం లేవని తెలుస్తోంది. మండలంలో సుమారు 15 కు పైగా ఎరువులు ,విత్తనాలు అమ్మకం దుకాణాలు ఉండగా ఏ ఒక్క దుకాణాల్లో అమ్మకం చేస్తున్న విత్తనాలను తనిఖీ చేయనట్లు సమాచారం. ప్రతి దుకాణంలో అమ్మకం చేసే  పత్తి ,వరి విత్తనాల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాల్సి ఉండడం అలాగే అవి నాణ్యమైనవా, కావా తనిఖీ చేసి అమ్మకం చేయవచ్చని అధికారులు సూచించాల్సి ఉంటుంది.

గతంలో పలుమార్లు తుంగతుర్తి మండలం లో నకిలీ విత్తనాలు రైతులు కొనుగోలు చేయడం, అవి మొలకలు రాక రైతాంగం  ఇబ్బందులు పడిన సంఘటనలు కోకొల్లలు. అయినా అధికారులు చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో పలు దుకాణాల తనిఖీల్లో నకిలీ పురుగు మందులు సైతం బయటపడటం, వెంటనే అధికారులు ఆ విషయాన్ని బయటకు రాకుండా చేయడం అందరికీ తెలిసిన విషయమే. దుకాణాల్లో అమ్మకం చేసే ప్రతి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల వివరాలు రాయాల్సిన బోర్డులు ఏవి దుకాణాల్లో లేవు. విత్తనాల ఎరువుల ధరల పట్టికలు లేనే లేవు. దుకాణదారుల తో అధికారులు కుమ్ముకై నాసిరకం ఎరువులు, విత్తనాలు, అమ్మకాలు సాగుతున్న కిమ్మనడం లేదని మాట వినవస్తోంది. ఇప్పటికే తుంగతుర్తి మండలం లోని విత్తనాలు దుకాణాల్లో పత్తి వరి విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయి. అవి నాణ్యమైన కావా నిర్ధారించే నాధుడే లేడనేది పలువురి రైతుల మాట. ఇప్పటికైనా అధికారులు విత్తనాల దుకాణాలు తనిఖీ చేసి, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.