యాదాద్రి అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలి : ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య

యాదాద్రి అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలి : ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, ముద్ర : ఆలేరు నియోజకవర్గ సాగు, తాగునీటికి నోచుకోలేదని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన ఆలేరు నియోజకవర్గం సమస్యల గురించి చర్చించారు..

గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గంధ మల్ల ప్రాజెక్టును ప్రపోజ్ చేశారని చెప్పారు. బస్వాపురం ప్రాజెక్టును 0.8 టీఎంసీలకు చేస్తే సుమారు 1.88 లక్షల ఆయకట్టు సాగులోకి వచ్చేదని చెప్పారు. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లుగా ఈ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్వాపురం ప్రాజెక్టును 2017లో 9.8 టీఎంసీలకు పెంచుతున్నట్లు ప్రకటించి ఒక రూపాయి కూడా నిధులను విడుదల చేయలేదన్నారు. 

సూర్యాపేట జిల్లాకు నీళ్లు తీసుకోపోవడం కోసం స్వలాభం కోసం పెంచారని ఆరోపించారు. దీని వలన ఈ ప్రాంతానికి నీరు రాకపోగా బస్వాపురం, రుస్తాపురంతో పాటు మరి కొన్ని గ్రామాలు పూర్తిగా ముంపుకు గురి అవుతున్నాయన్నారు.గంధ మల్ల ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 10 మండలాలు సస్యశ్యామలం అవుతాయని, దీనిపై దృష్టి సారించి ఈ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలన్నారు.

యాదాద్రి అభివృద్ధి పేరుతో దాదాపు 1500 కుటుంబాలు నిర్వీర్యం అయ్యాయని, వారు అన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పేరుతో రూ. 1400 కోట్లు ఖర్చు చేసి 50% నిధులు స్వలాభం కోసం వాడుకున్నారని దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించాలని కోరారు. యాదాద్రి అభివృద్ధి పేరుతో ఉపాధి కోల్పోయిన బాధితులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎంను కోరారు. 

మోటకొండూరు. మండలం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు అక్కడ స్వంత ప్రభుత్వ భవనాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లంతా గుంతలతో దారుణంగా తయారయ్యాయని,ఈ రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన కోరారు.