పట్టణంలో రోడ్లకు మహర్దశ - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పట్టణంలో రోడ్లకు మహర్దశ - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు అభివృద్ధి కేవలం తమ ప్రభుత్వ హయాంలో నే సాధ్యపడిందని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో మంచిర్యాల ప్రధాన రహదారి నుంచి దివ్యనగర్ రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ. 60 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో ఈ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అల్లోల ఇంద్రకరణ్ మాట్లాడుతూ పట్టణంలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు ఇటీవలే శంకుస్థాపన జరిగిందని అన్నారు. దీన్ని త్వరిత గతిన పూర్తి చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో అంతర్గత పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్, మురళీధర్ రెడ్డి, కమిషనర్ రాజు,స్థానిక కౌన్సిలర్ సబిత శ్రీధర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.