విభేదాలు వీడండి

విభేదాలు వీడండి
  • పార్టీని ముందుకు నడపండి
  • రాహుల్​సందేశం ప్రతి ఇంటికి చేరాలి
  • యాత్రను మండల నేతలు ముందుకు తీసుకెళ్లాలి
  • కాంగ్రెస్ రాష్ట్ర​ ఇన్చార్జీ మాణిక్ రావు ఠాక్రే

ముద్ర, తెలంగాణ బ్యూరో: విభేదాలు వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్​రావు ఠాక్రే కాంగ్రెస్​నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో అధికారం హస్తగతం చేసుకునేందుకు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. భారత్​ జోడో యాత్ర ద్వారా రాహుల్​గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ‘హాత్​ సే హాత్​ జోడో’ యాత్ర ద్వారా ప్రతి ఇంటి తలుపు తట్టాలని కోరారు. గాంధీభవన్ ప్రకాశం హాల్​లో శనివారం జరిగిన మండల స్థాయి పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేక ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. ప్రతి ఇంటికీ ‘హాత్ సే హాత్ జోడో’ స్టిక్కర్ అంటించాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల పన్నుల భారం నిరుపేద ప్రజలపై మోపారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. విపక్ష నేతలను నిత్యం కట్టడిచేసే ప్రయత్నం కొనసాగుతున్నదని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచి రెండు ప్రభుత్వాలు పేదలను మరింత పేదలుగా మార్చివేస్తున్నాయని ధ్వజమెత్తారు. ధరణితో వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 5 రోజుల తరువాత మరోసారి సమావేశం నిర్వహిస్తానని, అప్పటి వరకు విభేదాలుండొద్దని హెచ్చరించారు. జిల్లాలలో నిర్వహించే సమావేశాలకు పార్టీ అనుబంధ విభాగాలన్నింటిని పిలవాలని కోరారు. ఈ సమావేశంలో  గిరీష్ చోడెంకర్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరీ, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పీసీసీ మాజీ  అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి. హనుమంతరావు, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,  డీసీసీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు..