లక్షల ఉద్యోగం వదిలి లక్షణంగా సాగు

లక్షల ఉద్యోగం వదిలి  లక్షణంగా సాగు
  • సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం
  • రైతుల ఆత్మహత్యలతో చలించి
  • మేలు చేయాలని మనసులో తలచి
  • లెమన్ గ్రాస్ పంటకు ప్రాణం పోసిన
  • ఆదర్శ కర్షకుడు నరేందర్ రెడ్డి

కృషి ఉంటే మనుషులు రుషులవుతారంటారు. పాటి నరేందర్ రెడ్డి ఆ కోవకే చెందుతారు. దేశ విదేశాలలో లక్షల రూపాయల ఆదాయాన్ని తెచ్చి పెట్టే ఉద్యోగం చేశారు. కానీ అవేవీ ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. మనసంతా వ్యవసాయం మీదనే. అందుకే ఉద్యోగం వదిలి సొంత ఊరికి చేరుకున్నారు. ప్రకృతి వైపర్యాలను తట్టుకునే లెమన్ గ్రాస్ సాగు మీద దృష్టి పెట్టారు. సుగంధ నూనెను ఉత్పత్తి చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.  

ముద్ర ప్రతినిధి, మెదక్:
లెక్చరర్ గా, ఫార్మసిస్ట్ గా పని చేసి లక్షల వేతనం తీసుకున్నా ఆయనకు సంతృప్తినివ్వలేదు. ఉద్యోగాన్ని మానేసి వ్యవసాయం మీద మక్కువతో సేంద్రియ పద్ధతిలో నిమ్మగడ్డి సాగుపై దృష్టి సారించారు. నాణ్యమైన సుగంధ నూనెను ఉత్పత్తి చేస్తూ, లాభాల బాటలో పయనిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మెదక్ జిల్లా చల్మెడ గ్రామానికి చెందిన పాటి నరేందర్ రెడ్డి త్రిపురలో ఫార్మసిస్ట్‌గా పని చేశారు. కర్ణాటకలో డిప్లొమా విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అమెరికాకు వెళ్లి మాస్టర్ పెరాసిటికల్ టెక్నాలజీలో 20 సంవత్సరాలు పని చేశారు. అయినా ఆయనలో ఏదో వెలితి. 

మూస పద్ధతిని కాదని
తన దృష్టంతా వ్యవసాయం మీదనే. దాదాపు అందరు రైతులు వరి సాగుకు అధిక ప్రాధాన్యమినిస్తున్నారు. మూస పద్ధతిలోనే పంట పండిస్తున్నారు. వరికి అధికంగా చీడపీడలు ఆశించడం, క్రిమిసంహారక మందులు వేసినప్పటికి ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది చూసి చలించిపోయిన  నరేందర్ రెడ్డి రైతులకు ఏదైనా మేలు చేయాలనుకున్నారు. తక్కువ ఖర్చుతో అధిక లాభసాటినిచ్చే పంటల వైపు వారిని మళ్లించాలనుకున్నారు. అదే సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలి పొలం బాట పట్టారు.

రసాయనిక ఎరువులతో ముప్పని
‘ఆరోగ్యమే మహాభాగ్యo’అనే నానుడి ఉంది కదా? పంటల సాగులో రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటంతో భూమి సారం తగ్గిపోతుందనే ఆవేదన, నేలతల్లిని కాపాడాలన్న సంకల్పంతో సేంద్రియ పద్ధతి వైపు మొగ్గు చూపారు. 2011లో ఐదు ఎకరాలలో మొదటగా తులసి, పామరోసాకాశ గడ్డి (రోజ్ ఫ్లేవర్), సిట్ర నెల్ల (ఆరెంజ్ ఫ్లేవర్) లెమన్ గ్రాస్ సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ప్రారభించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో  వాటిని నిలివేశారు. ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రస్తుతం 18 ఎకరాలలో లెమన్ గ్రాస్ ను అతితక్కువ నీటితో సాగు చేస్తున్నారు. మొదటగా విత్తనాన్ని లక్ష రూపాయలు ఖర్చు చేసి లక్నో నుండి తీసుకువచ్చారు. శద్ధతో లెమన్ గ్రాస్ పెంచడం ప్రారంభించారు.

నష్టం కలుగకుండా 
లెమన్ గ్రాస్ ఒక మీటర్ వరకు పెరుగుతుందని చెబుతున్నారు నరేందర్ రెడ్డి. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ లెమన్ గ్రాస్ కు నష్టం రాదు, పశువులు, అడవి పందులు, కోతుల వల్ల దీనికి ఎలాంటి నష్టం వాటిల్లదు. అలాగే చీడపీడలు ఆశించకుండా ఉంటుందని వివరించారు.

లాభదాయకం
మూడు నెలల్లో కోతకొస్తుంది  కోతకు వచ్చిన గడ్డిని డిసులేషన్ యూనిట్‌లో వేసి మర పెట్టడం జరుగుతుంది. ఆ యూనిట్ ధర 6 నుండి 12 లక్షల వరకు ఉంటుంది. ఒక ఎకరానికి ఒక టన్ను గడ్డి రాగా దాని నుండి 8 కేజీల సుగంధ నూనె వస్తుంది. దీనికి మార్కెట్లో కిలో ధర రూ.1200 నుంచి రూ.1800 వస్తుందని నరేందర్ రెడ్డి తెలిపారు. లెమన్  గ్రాస్ ద్వారా వచ్చిన నాణ్యమైన సుగంధ నూనెను వివిధ రకాల కాస్మోటిక్స్‌లలో ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ ను సాగు చేయడం ద్వారా వాతావరణంలో ఉన్న కాలుష్యం తగ్గి దాని చుట్టుపక్కల ఆరోగ్యవంతమైన  గాలి వెలువడుతుంది. రైతులు లాభదాయకమైన ఆరుతడి, వాణిజ్య పంటలపై దృష్టి సారించాలంటున్నారు నరేందర్ రెడ్డి.