ప్రజలు మోసపోతారనే విశ్వాసమే కాంగ్రెస్ బలం మంథని బిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్

ప్రజలు మోసపోతారనే విశ్వాసమే కాంగ్రెస్ బలం మంథని బిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్

మహాదేవపూర్, ముద్ర: ప్రజలను సుమాయాసంగా మోసం చేయవచ్చని, మోసపోతారని విశ్వాసంతో అబద్దాలను ప్రచారం చేయడమే కాంగ్రెస్ పార్టీ బలమని, ప్రజలను హెచ్చరించడానికి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టినట్లు మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. యాత్రలో భాగంగా అంబటిపల్లి, సూరారం, బెగులూరు, ఎలికేశ్వరం, బొమ్మాపూర్, మహాదేవపూర్, ఎడపల్లి, కుదురుపల్లి, కాళేశ్వరం గ్రామాలను శనివారం నాడు పర్యటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షంలో ఉన్నందున ఏమీ చేయలేనంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని  మధు విమర్శించారు. ప్రజలను మేకలు, గొర్రెలుగా భావిస్తూ దశాబ్దాలుగా మోసం చేయడానికి అలవాటుపడ్డారని విమర్శించారు.

ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడి, సేవలు చేస్తున్న నాపై రెండు కోట్లతో కిరాయి సోషల్ మీడియా నిపుణులను నియమించుకొని నాపై బురద చల్లుతున్నాడని, ఓటు బంధం కాకుండా పేగు సంబంధంతో మీ బిడ్డగా ప్రజల కష్టాలను దూరం చేయడానికి నడుంబిగించిన నన్ను కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 40 సంవత్సరాలుగా అనేకమంది ప్రాణాలను, బాలింతలను బలిగొన్న పెద్దంపేట వంతెనను నిర్మించి చూపించానని అన్నారు. అటవీ గ్రామాల ప్రజలకు వంతెనలను, రోడ్లను, కస్తూరిబా పాఠశాలను, ఇళ్లను నిర్మించాను. పెళ్లిళ్లు, వైద్య సహాయం, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విదేశాలలో చదువుకునే వారికి ఆర్థిక సహాయం, అంబులెన్సుల ఎర్పాటు ట్రస్టు ద్వారా చేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని పేదలకు చేర్చానని అన్నారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల కోసం హైదరాబాదులో బాల బాలికలకు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పస్తానని ప్రకటించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి రిజిస్ట్రేషన్ వ్యాల్యూని పెంచి అత్యధిక లాభం జరిగేలా చూశానని, ఒక్కరికి అన్యాయం జరిగినా ముందుకు వచ్చి చెప్పాలని కోరారు. తాను కంపనీ పై ఒత్తిడి తెచ్చి ఎల్ అండ్ టి రోడ్డును నిర్మించానని, గ్రామాల వద్ద గోదావరి తీరంలో మెట్లు నిర్మించాల్సిఉందని ఈ ప్రాంతాన్ని ఒక 'టూరిస్టు క్యారిడారు'గా మార్చి తీరుతానని పుట్ట మధు అన్నారు.

ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాల పై పోరాటం చేయకుండా ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇచ్చి ఇంట్లో పడుకున్న వ్యక్తి ప్రజల కష్టాలను ఎలా తీర్చగలరని ప్రశ్నించారు. బార్ల కోసం, పేకాట క్లబ్బుల కోసం ప్రభుత్వం భూమి సేకరించలేదని, భూములలో అవినీతి జరిగిందని నక్సలైట్లతో ప్రకటనలు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ తమను హత్య చేయడానికి ప్రయత్నించిందని తీవ్రంగా విమర్శించారు. దలిత, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణాలకు తెగించి నిలబడ్డ నన్ను బొందపెట్టాలని చేస్తున్న కుట్రలను అప్రమత్తంగా అడ్డుకోవాలని కోరారు. యాత్రలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమత, రైతు సమితి అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, మహిళ నాయకురాలు కేదారి గీత, సర్పంచ్ శ్రీపతి బాపు, గోగులమల్లయ్య, వసంత, చల్ల ఓదెలు, టిఆర్ఎస్ నాయకులు పెండ్యాల మనోహర్, ఆన్కారి ప్రకాష్, రవీందర్ రెడ్డి, వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, ఓడేటి స్వప్న, చల్ల రాజిరెడ్డి, తలారి గట్టయ్య, దుర్గయ్య, లింగాల రామయ్య, వేమునూరి జక్కయ్య, వెన్నంపల్లి మహేష్, రామ్ నారాయణ గౌడ్, అలీం తదితరులు పాల్గొన్నారు.