లారీ-కారు ఢీకొని ఒకరి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు - బైంసాలో ఘటన

లారీ-కారు ఢీకొని ఒకరి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు - బైంసాలో ఘటన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణం సరిహద్దులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బైంసా నుంచి నాందేడ్ వైపు వెళుతున్న లారీ, నాందేడ్ నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఆదిత్య (7), కళావతి (48) లను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్, నిర్మల్ లకు తరలించారు. నిర్మల్ కు తరలిస్తున్న ఆదిత్య(7) మార్గమధ్యంలో మృతి చెందాడు. షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకుని మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే ముందు ఈ ప్రమాదం సంభవించడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.