కాంగ్రెస్ టికెట్లపై వీడిన పీటముడి

  • సూర్యాపేట కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు
  • సూర్యాపేట: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
  • మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
  • తుంగతుర్తి:మందుల సామేలు
  • రమేష్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో హైవేపై రాస్తారోకో
  • బోరున విలపించిన
  • రమేష్ రెడ్డి,కుటుంబ సభ్యులు,నాయకులు అభిమానులు


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఇన్నాళ్లుగా ఊరించి ఊరించి, ఉత్కంఠరేపి, ఊగిసలాడి, నాన్చి, నాన్చి,సాగదీసి చివరకు గురువారం రాత్రి ప్రకటించిన మూడో జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలు సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తిలకు అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్  నాయకులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంనుంచి మాజీమంత్రి, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, సామాజికసేవకుడు బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తినుంచి ఇటీవల బి ఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలులను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు అందరూ నామినేషన్లు వేశారు.

సూర్యాపేట కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గవిభేదాలు

సూర్యాపేట నుంచి టికెట్ ఆశిస్తున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి చివరిక్షణం వరకు కూడా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్యన దామోదర్ రెడ్డికి టికెట్ దక్కడంతో రమేష్ రెడ్డి వర్గీయులు గురువారం అర్ధరాత్రి సూర్యాపేట వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి టిపిసిసి చీఫ్ రేవంత్    రెడ్డి డౌన్, డౌన్, రమేష్ రెడ్డికి న్యాయం చేయాలి, సూర్యాపేట టికెట్ మార్చాలి, రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

బోరున విలపించిన రమేష్ రెడ్డి, కుటుంబ సభ్యులు, నాయకులు అభిమానులు, కార్యకర్తలు

తాను ఆశించిన విధంగా టికెట్ రాలేదని తెలుసుకున్న పటేల్ రమేష్ రెడ్డి, కుటుంబ సభ్యులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బోరున విలపించారు. నాయకులు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. పార్టీ తనను మోసం చేసిందని, అయినా ఎన్నికల బరిలో నిలుచుంటానని ఆయన చెప్పారు. మొదట ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటానని ప్రకటించిన రమేష్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున సింహం గుర్తుపై పోటీ చేయనున్నట్టు ఆయన వర్గీయులు వెల్లడించారు. సూర్యాపేట ప్రజలమద్దతు తనకే ఉందని, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మద్దతుతో తప్పకుండా ఎంఎల్ ఏగా గెలుపొందుతానని రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ దక్కకపోవడంతో నిరాశలో ఉన్న రమేష్ రెడ్డి మద్దతు కోరుతూ దామోదర్ రెడ్డి రమేష్ రెడ్డి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు, తన ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న రమేష్ రెడ్డి వెంటనే ఇంటినుంచి బయటికెళ్లినట్టు రమేష్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. కాగా
రమేష్ రెడ్డి శుక్రవారం పట్టణంలో బారీ ర్యాలీ నిర్వహించి ఈ రోజుకూడా మరోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే తుంగతుర్తి అభ్యర్థి విషయంలో కూడా మొదటి నుంచి టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, వడ్డేపల్లి రవి, అన్నెపర్తి జ్ఞానసుందర్ లను కాదని అనూహ్యంగా బి ఆర్ ఎస్ ను వీడిన మందుల సామేలు టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడినుంచి టికెట్ ఆశించిన మోత్కుపల్లి నర్సింహులు కు కూడా మొండిచెయ్యి చూపారు. మిర్యాలగూడలో కూడా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్  తో బాటు మరో ఐదుగురు టికెట్ కోసం తీవ్రంగా
ప్రయత్నించినప్పటికీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్డర్, సామాజిక కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టిన బత్తుల లక్ష్మారెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం ముందు చూపింది.