కేదార్ నాథ్​పసిడి తాపడంలో రూ.125 కోట్ల కుంభకోణం!

కేదార్ నాథ్​పసిడి తాపడంలో రూ.125 కోట్ల కుంభకోణం!
  • ఆలయ పూజారి సంతోష్‌ త్రివేది
  • తోసిపుచ్చిన ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర

చార్​ధామ్​: హిమగిరుల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయానికి సువర్ణ తాపడంలో గోల్‌మాల్ జరిగిందని ఆలయ సీనియర్‌ పూజారి సంతోష్‌ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు. చార్-ధామ్ మహా పంచాయత్ వైస్ -ప్రెసిడెంట్‌‌గా ఉన్న సంతోష్ త్రివేది.. ఈ వ్యవహారంలో రూ.125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ తోసిపుచ్చింది. గతేడాది మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగార తాపడం చేయించారు. ఇవి స్వర్ణ పలకలు కాదని, అంతా ఇత్తడేనని సీనియర్ పూజారి ఆరోపిస్తున్నారు. ఆలయ గర్భగుడి లోపల గోడలను బంగారు రేకులతో కప్పుతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని ఆరోపించారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతానని సంతోష్​హెచ్చరించారు. ఆలయానికి స్వర్ణ తాపడం విషయంలో కమిటీలోని పలువురు వ్యతిరేకించారని, ఇది సంప్రదాయానికి విరుద్ధమని అన్నారు. అయితే బద్రీనాథ్- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ మాత్రం దీనిని తోసిపుచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేదార్‌నాథ్‌ అభివృద్ధి పనులు అద్భుతంగా జరుగుతున్నాయని, ఇది ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త కేదార్‌నాథ్ ఆలయానికి 230 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ బంగారంతోనే ఆలయానికి సువర్ణ తాపడం పనులు ప్రారంభించారు. ఆలయం లోపల రూ.14.38 కోట్ల విలువైన 23.7 కిలోల బంగారంతో తాపడం చేయించారు.