గుండెపోటుతో తహాసిల్దార్ హఠాన్మరణం

గుండెపోటుతో తహాసిల్దార్ హఠాన్మరణం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహాసిల్దార్ ఎం.డీ ఫరీదోద్దీన్ (53) గుండెపోటుతో బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మండల ప్రజా ప్రతినిధులు ముస్లిం పెద్దలతో కలిసి తహాసిల్దార్ పాల్గొన్నారు. విందు ముగిసిన తర్వాత పది గంటల సమయంలో కేసముద్రంలో తాను అద్దెకుంటున్న ఇంటికి వెళుతున్న క్రమంలో చాతిలో నొప్పి వస్తుందంటూ సిబ్బందికి చెప్పగా వెంటనే స్థానిక ప్రైవేటు వైద్యునికి చూపించారు. తహాసిల్దార్ కు గుండెపోటు వచ్చినట్లు గుర్తించిన వైద్యుడు వెంటనే చికిత్స కోసం మహబూబాబాద్ తరలించాలని సూచించగా, సిబ్బంది కారులో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వైద్యులు గుండెపోటుకు గురైన తహశీల్దార్ కు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 11 గంటల సమయంలో తహాసిల్దార్ తుది శ్వాస విడిచారు. తహాసిల్దార్ కు గుండెపోటు వచ్చిన విషయాన్ని తెలుసుకొని ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని దగ్గరుండి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోవడం, కొద్దిసేపటి క్రితం వరకు తమతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న తహాసిల్దార్ విగత జీవుడుగా మారడంతో ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దివంగతుడైన తహాసిల్దార్ పార్థివ దేహాన్ని హనుమకొండలోని ఆయన స్వగృహానికి తరలించారు. మృతి చెందిన తహాసిల్దార్ ఫరీదోద్దీన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

తహాసిల్దార్ మృతి పట్ల కలెక్టర్ శశాంక సంతాపం

కేసముద్రం తహసిల్దార్ మహమ్మద్ ఫరీదోద్దీన్  హఠాన్మరణం పట్ల మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక సంతాపం వ్యక్తం చేశారు. హనుమకొండలోని తహసిల్దార్ నివాసానికి వెళ్లి ఫరీదుద్దీన్ భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తహాసిల్దార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం అందజేస్తామని ప్రకటించారు. నిబద్ధత, నిజాయితీ గల అధికారిని కోల్పోయామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట మహబూబాబాద్ ఆర్డిఓ కొమురయ్య, ఇనుగుర్తి తహసిల్దార్ మహమ్మద్ దిలావర్ ఆబిద్ అలీ, కేసముద్రం డిప్యూటీ తహాసిల్దార్ సాంబశివుడు, ఆర్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులున్నారు. దివంగత తహసిల్దార్ ఫరీదోద్దీన్ మరణం పట్ల కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. హనుమకొండ కు చేరుకొని తహాసిల్దార్ భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.