రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్లు బాగున్నాయి.

రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్లు బాగున్నాయి.
  • సిద్దిపేటలో జరిగిన డెవలప్మెంట్ లో హరీష్ రావు శ్రమ ఉంది
  • 'ముద్ర ప్రతినిధి'తో తిరుచిరాపల్లి మాజీ మేయర్ ఎస్.సుజాత

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చాలా బాగుందని తమిళనాడులోని తిరుచిరాపల్లి నగర మాజీ మేయర్ ఎస్ సుజాత చెప్పారు. పట్టణంలోని రోడ్లు కూడా చక్కగా ఉన్నాయని ఆమె అన్నారు సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను తడి పొడి హానికర చెత్త సేకరణ విధానాన్ని దాని వినియోగ విధానాన్ని పరిశీలించడానికి సిద్దిపేటకు విచ్చేసిన ఎస్.సుజాత 'ముద్ర ప్రతినిధి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సిద్దిపేట పట్టణాభివృద్ధిలో ఇక్కడి మంత్రి హరీష్ రావు శ్రమ అధికంగా ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్న ఎస్. సుజాత తిరుచురాపల్లికి 2010 నుండి 2012 వరకు నగర మేయర్ గా పని చేశారు. తాను మేయర్ గా పనిచేసిన సమయంలో దాదాపు 10 లక్షల జనాభా తిరుచురాపల్లి లో ఉండేదని ఆమె తెలిపారు. 50 వార్డులతో ఉన్న పట్టణంలో అప్పుడు మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని దాని నివారణకు 20 ఓవర్ హెడ్ ట్యాంకులను తన పదవీకాలంలో నిర్మించాలని చెప్పారు. 120 దివ్య దేశాలలో మొదటిదైన శ్రీరంగం పెరుమాళ్ స్వామి తమ వద్ద ఉందని ఆమె తెలిపారు.రాక్ పోర్టు తిరు ఓకే వాల్, సమీబరా అమ్మ దేవాలయాలతో పాటు అనేక చారిత్రక దేవాలయాలకు కొలువైన తిరుచురాపల్లిని తమిళనాడులోనే టెంపుల్ సిటీగా పిలుస్తారని సుజాత తెలిపారు.వైకుంఠ ఏకాదశికి తమ పట్టణములో  అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తమకు అదే పెద్ద పండుగని మాజీ మేయర్ తెలిపారు. తిరుచిరాపల్లిలో ఎక్కువగా వెజిటేబుల్స్ మార్కెట్లు ఉంటాయని అదే ప్రధానమైన బిజినెస్ అని ఆమె తెలిపారు. పట్టణాభివృద్ధిని తక్కువ కాలంలోనే సాధించిన మంత్రి హరీష్ రావు ఈ ప్రాంత ప్రజలందరికీ అభిమాన నాయకునిగా గుర్తింపు సాధించాడని, తనకు ఈ పర్యటనలో అర్థమైందని ఆమె తెలిపారు.ఇక్కడి డెవలప్మెంట్ తమ వద్ద కూడా చేయడానికి నగరపాలక సంస్థతో మాట్లాడతామని ఆమె వెల్లడించారు.