కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: కేంద్ర మంత్రి రూపాల హామీ

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: కేంద్ర మంత్రి రూపాల హామీ

ముద్ర ప్రతినిధి :సిద్ధిపేట:-ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక,మత్స్య శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల హామీ ఇచ్చారు.బిజెపి చేపట్టిన మహాజన సంపర్కు అభియాన్ యాత్రలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన కేంద్ర మంత్రి జిల్లా బిజెపి అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. గజ్వేల్ నుంచి కొమురవెల్లి మీదుగా సిద్దిపేట వైపు నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణ పనులను ఈ సందర్భంగా కేంద్రమంత్రి పరిశీలించారు.

రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ప్రతినిత్యం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేస్తున్నందున కొమురవెల్లి వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయించాలని బిజెపి శ్రేణులు,స్థానిక ప్రజలు మల్లికార్జున స్వామి దేవుని సాక్షిగా వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అంద చేశారు.దీంతో ఆయన వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్ర రైల్వే మంత్రిని కలిసి,మాట్లాడి కొమురవెల్లికి రైల్వే స్టేషన్ తప్పక మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.