‘కార్గో’ పరుగులు

‘కార్గో’ పరుగులు
  • తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలో ఆర్టీసీ సేవలు
  • ‌‌మూడేళ్లలో రూ.217.01 కోట్ల ఆదాయం
  • రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాలు, ప్రత్యేకంగా 193 వెహికల్స్​ఏర్పాటు


ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కార్గో పరుగులు పెడుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రారంభించిన కార్గో సేవలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో ఏడాది క్రితం వరకు కేవలం తెలంగాణ, ఏపీకే పరిమితమైన కార్గో సేవలను ఆ సంస్థ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.19 జూన్​2020న రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్ల పరిధిలో ఉన్న 80 కేంద్రాల్లో కార్గో కొరియర్స్​అండ్​పార్సిల్ సేవలు ప్రారంభమయ్యాయి. పార్సిళ్ల బుకింగ్స్, వచ్చిన పార్సిళ్లు ఇవ్వడానికి ఆర్టీసీ ప్రత్యేకంగా 380 మందిని నియమించింది. రాష్ట్రంలో ఎక్కడికైనా పార్సిల్స్​, కొరియర్లు పంపే అవకాశాలుండడం, తక్కువ ఖర్చు,  తక్కువ సమయంలో పార్సిళ్లు చేతికి అందడంతో ప్రజలు కార్గో వైపు మొగ్గుచూపుతున్నారు. చిన్న చిన్న పార్సిళ్లు, కొరియర్లను ఆర్టీసీ బస్సుల ద్వారా అందిస్తున్న ఆ సంస్థ.. భారీ పార్సిళ్ల రవాణా కోసం ప్రత్యేకంగా 193 వాహనాలు ఏర్పాటు చేసింది. శిశుసంక్షేమ శాఖ, ఇంటర్మీడియల్ బోర్డు, ఎఫ్​సీఐ శాఖలతో ఒప్పందం కుదుర్చుకుని వాటికి సంబంధించిన సామగ్రిని ఆయా వాహనాల్లో తరలిస్తోంది. అలాగే ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సంబంధించిన తలంబ్రాలు సైతం కేవలం రూ.116లకే భక్తుల ఇంటికి పంపిస్తూ సేవలను విస్తరించుకుంటూపోతోంది. రెండేళ్లలో ఆయా డిపోల్లో ముందుగా దరఖాస్తు చేసుకున్న 2,05,487 మందికి తలంబ్రాలు అందించింది. వీటిద్వారా రూ.2,38,36,492 లు ఆర్జించింది. వీటితోపాటు గత మేడారం జాతరకు హాజరుకాలేని 5,129 మంది భక్తుల పేరిట కనీసం 5 కిలోల బెల్లం వనదేవతలకు సమర్పించి తిరిగి ఆ భక్తులకు అరకిలో బెల్లం వారి ఇంటికి పార్సిల్ అందించి అదనంగా రూ.10లక్షల వరకు ఆదాయాన్ని పొందింది. మూడేళ్లలో 1.24 కోట్ల వరకు బుక్సింగ్స్(ఆర్టీసీ బస్సుల్లో)​చేసిన కార్గో రూ.217.01 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో 48.85లక్షల బుకింగ్స్ చేయగా వాటి ద్వారా రూ.71.34 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది.

ఆదరణ పెరుగుతుంది- సంతోష్​కుమార్, ఆర్టీసీ కార్గో ఇన్​చార్జి, హైదరాబాద్
ఆర్టీసీ కార్గో సేవలపై ప్రజల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. అతి తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే పార్సిళ్లు, కొరియర్లు చేరవేస్తుండడంతో ప్రజలు కార్గో సేవలపై మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు, ఆర్టీసీ కార్మికుల నిరంతర శ్రమతో కార్గో సేవలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకూ కార్గో సేవలు విస్తరించుకున్నాం. భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు విస్తరించాలని నిర్ణయించుకున్నాం.


ఏప్రిల్​2022‌ నుంచి ఏప్రిల్​23 వరకు కార్గో ద్వారా ఆర్టీసీ ఆర్జించిన ఆదాయం
‌================================================
రీజియన్​  బుకింగ్స్(లక్షల్లో) ఆదాయం (రూ.కోట్లలో)

ఆదిలాబాద్​   2.59 3.25
నిజామాబాద్​  3.21   3.70
కరీంనగర్​   5.87   7.54
వరంగల్​   3.39   4.65
ఖమ్మం    3.90   5.85
రంగారెడ్డి   9.23   15.75
మెదక్​   2.23   2.55
మహబూబ్​నగర్​  4.29   5.01
నల్లగొండ   3.33   4.37
సంగారెడ్డి   7.14   12.35
హైదరాబాద్​   3.68   6.33


మొత్తం  48.85 లక్షలు 71.34 కోట్లు