పాపం బండి సంజయ్! చుట్టూ వివాదాలే!!

పాపం బండి సంజయ్! చుట్టూ వివాదాలే!!
  • మొన్న అమిత్ షా షూ మోశారని
  • ఇపుడు జవదేకర్ బూట్లతోనే గుడిలోకి పోయిండని
  • వివరణ ఇచ్చుకుంటున్న బీజేపీ స్టేట్ చీఫ్
  • బీజేపీకి అభ్యర్థులు లేరని వ్యాఖ్య
  • సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు​

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు వివాదాలు తెచ్చి పెడుతున్నాయి. ప్రధానంగా ఆయన బూట్ల లొల్లిలో ఇరుక్కుంటున్నారు. గతంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని బయటకు రాగానే బూట్లను చేతిలో పట్టుకుని తెచ్చి ఇచ్చిన వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. గుజరాతీలకు గులాంగిరి చేస్తున్నాడని, బూట్లు మోస్తున్నాడని పదేపదే ప్రచారానికి వాడుకున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్​ పర్యటన కూడా అలాంటి వివాదానికే దారి తీసింది. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా వేములవాడ ఆలయంలో పూజలు చేసిన ప్రకాశ్​జవదేకర్ గర్భగుడి వరకు బూట్లతోనే వెళ్లారంటూ సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఈ అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు బండి సంజయ్ నానా తంటాలు పడుతున్నారు. ఇక, ఇదే పర్యటనలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్​ పార్టీకి డిపాజిట్ గల్లంతవుతున్నదని చెబుతూనే, అదే స్పీడ్​లో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారంటూ వ్యాఖ్యానించారు. 

సమర్ధించుకునే యత్నం
సోషల్​ మీడియాలో స్పీడ్​ గా ఉండే బీజీపీని ఇప్పుడు నెటిజన్లు అదేస్థాయిలో అటాడుకుంటున్నారు. అమిత్​ షా బూట్లు మోశారంటూ ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశ్ జవదేకర్​ కూడా ఆలయంలోకి బూట్లతో వెళ్లడం మరింత ఆజ్యం పోసినట్లుగా మారింది. ఆలయంలోకి బూట్లతో వెళ్తుండగా పూజారి కూడా అడ్డు చెప్పినట్లు ఫొటోలను షేర్​ చేస్తున్నారు. ఈ ఫొటోలలో పూజారి అభ్యంతరం చెప్పడం, గర్భగుడి పక్కన ఆయన బూట్లు విప్పుతుండటం స్పష్టంగా కనిపిస్తున్నది. హిందుత్వం గురించి తీవ్రస్థాయిలో చెప్పుకునే బీజేపీ నేతలు ఇలా గుళ్లలోకి చెప్పులతో వెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, వీటిని సమర్ధించుకునేందుకు బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​తో పాటుగా సోషల్​ మీడియా టీం రంగంలోకి దిగింది. అవి షూ కాదని.. సాక్స్​లు అంటూ రిప్లై ఇస్తున్నారు. కానీ, పూజారి ఎందుకు అభ్యంతరం చెప్పారంటూ నెటిజన్లు తిరిగి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. 

పార్టీకి అభ్యర్థులు లేరు
బీజేపీలోని విభేదాలతో నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా బండి సంజయ్​ ఏకంగా తమ పార్టీకి అభ్యర్థులు లేరంటూ ప్రసంగంలో చెప్పుకొచ్చారు. దీనిని వెనువెంటనే అందుకున్న విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. అయితే, బీఆర్ఎస్​అనబోయి బీజేపీని అన్నారంటూ కాషాయం నేతలు సమర్ధించుకుంటున్నారు. కానీ, ఒకేరోజు జరిగిన పర్యటనలో రెండు అంశాలలో బీజేపీ స్టేట్​ చీఫ్​ వివాదంలో కూరుకుపోయారు.