101 మంది మృతుల ఆచూకీ ఎక్కడ?

101 మంది మృతుల ఆచూకీ ఎక్కడ?
  • రైలు ప్రమాదంలో గుర్తించని అధికారులు
  • సీబీఐ విచారణపై విపక్షాల విసుర్లు

బాలాసోర్​: ఒడిశాలోని బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో 288 మంది మృతి చెందగా అందులో 101 మంది మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పలు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 200 మందికిపైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో 1,100 మంది గాయపడగా ఇప్పటివరకు 900 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు బాలాసోర్ జిల్లాలోని బ‌హ‌న‌గా బ‌జార్ స్టేష‌న్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘ‌ట‌న‌పై మంగళవారం సీబీఐ విచార‌ణ ప్రారంభించింది. అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. కాగా సీబీఐ విచారణను కాంగ్రెస్​ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన రైల్వే ప్రమాదాలను ఎన్నడూ సీబీఐ విచారణ చేయలేదన్నారు. క్రైమ్ కేసులకు సంబంధించే సీబీఐ దర్యాప్తు చేస్తుందని, రైలు ప్రమాదంలో ఈ అంశానికి సంబంధించిన కోణమే లేదన్నారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వేశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఇప్పటికే రాహుల్​గాంధీ డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ రైల్వేబోర్డు నివేదిక వచ్చే కంటే ముందే సీబీఐ దర్యాప్తు ప్రకటన చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ అంశంపై మాట్లాడుతూ జ్ఞానేశ్వర్​ఎక్స్​ప్రెస్​, సౌథియా దుర్గటలపై సీబీఐ దర్యాప్తు చేసినా ఏమీ తేలలేదన్నారు.