కర్ణాటక సీఎం కారు ఆకస్మిక తనిఖీ

కర్ణాటక సీఎం కారు ఆకస్మిక తనిఖీ

కర్ణాటక  ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై  ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ శుక్రవారం  ఆకస్మికంగా తనిఖీ చేసింది.  దొడ్డబల్లాపూర్‌‍లోని శ్రీ ఘాటి సుబ్రహ్మణ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆపింది. అనంతరం తనిఖీలు చేపట్టింది. మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అమలులో ఉంది.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గత బుధవారం  ప్రకటించారు. మే 10న ఎన్నికలు జరుగనుండగా, 13న కౌంటింగ్ ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం  కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ, కేంద్రం, రాష్ట్రంలోని పథకాలపైనే బీజేపీ ఆశపెట్టుకోగా, 40 పర్సంట్ కమిషన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ బీజేపీకి దీటుగా కాంగ్రెస్ పోటీ ప్రచారం సాగిస్తోంది. జేడీఎస్ సైతం రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, రైతు సంక్షేమానికి పాటుపడతామంటూ ఎన్నికల్లో ప్రచారం సాగిస్తోంది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రకటన ప్రకటన వెలువడటంతో ఈనెల 29 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రకటన వెలువడక మందే రాష్ట్రంలో ఇటీవల పలు మార్లు పర్యటించారు. ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీతో ఈసారి కర్ణాటక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేయించేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.